ధర్మారం/రామడుగు/బోయినపల్లి, ఆగస్టు 10: కాళేశ్వరం ప్రాజెక్టు లింక్-2లో ఎత్తిపోతలు కొనసాగుతున్నాయి. దిగువన పెద్దపల్లి జిల్లాలోని శ్రీపాద ఎల్లంపల్లి జలాశయం నుంచి అండర్ టన్నెళ్ల ద్వారా నందిమేడారంలోని నంది పంప్‌హౌస్‌కు జలాలు చేరుతుండగా, శనివారం ఒక మోటర్ ద్వారా 3,150 క్యూసెక్కుల నీటిని నంది రిజర్వాయర్‌లోకి ఎత్తిపోస్తున్నారు. అక్కడి నుంచి జంట సొరంగాల ద్వారా కరీంనగర్ జిల్లా లక్ష్మీపూర్‌లోని గాయత్రీ పంప్‌హౌస్‌కు తరలిపోతున్నాయి. ఇక్కడ కూడా ఒకే మోటర్ నడిపిస్తున్నారు.
మొత్తం 3,150 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోస్తూ శ్రీ రాజరాజేశ్వర జలాశయానికి తరలిస్తున్నారు. శనివారం సాయంత్రం వరకు ఎల్లంపల్లి నుంచి 13 టీఎంసీలకుపైగా జలాలు మధ్య మానేరుకు తరలించినట్టు ప్రాజెక్టు అధికారులు తెలిపారు. మధ్యమానేరు జలాశయంలో 27.54 టీఎంసీల నీటి సామర్థ్యానికిగాను ప్రస్తుతం 17.06 టీఎంసీల నీటి నిలువ ఉన్నట్టు అధికారులు తెలిపారు. మధ్యమానేరు నుంచి సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం అనంతగిరిలోని అన్నపూర్ణ ప్రాజెక్టుకు నీటిని తరలిస్తున్నారు.
మధ్యమానేరు నుంచి అండర్ టన్నెళ్ల ద్వారా తిప్పాపూర్‌లోని సర్జ్పూల్కు జలాలు చేరుతుండగా, ఇక్కడ పంప్‌హౌస్‌లో రెండు బాహుబలి మోటర్ల ద్వారా 6,440 క్యూసెక్కులు అన్నఫూర్ణ జలాశయానికి చేరుకుంటున్నాయి. ఇక్కడ జలాశయం గేట్లు తెరిచి అంతే మొత్తంలో రంగనాయకసాగర్‌కు వదులుతున్నారు. అన్నపూర్ణ జలాశయంలో 3.5 టీఎంసీల సామర్థ్యానికిగాను ప్రస్తుతం 1.25 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్టు అధికారులు తెలిపారు.
కృష్ణాకు వరద ప్రవాహం తగ్గడం లేదు. శనివారం జూరాల ప్రాజెక్టుకు 1.90 లక్షలు ఇన్‌ఫ్లో, 1.71 లక్షల అవుట్‌ఫ్లో నమోదైంది. శ్రీశైలం జలాశయానికి 1.86 లక్షల క్యూసెక్కుల వరద రాకతో 6 గేట్ల ద్వారా 2,23,142 క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. నాగార్జునసాగర్‌కు 3,55,590 క్యూసెక్కులు వస్తుండగా 26 క్రస్ట్‌గేట్లు ఎత్తి 3,12,756 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.
సాగర్‌లో కృష్ణమ్మ అందాలను వీక్షించేందుకు పర్యాటకులు భారీగా తరలివచ్చారు. కాగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మేడిగడ్డ బరాజ్‌కు శనివారం 3,41,350 క్యూసెక్కుల వరద రాగా, మొత్తం 85 గేట్లు ఎత్తి అంతే మొత్తంలో దిగువకు విడుదల చేస్తున్నారు. అన్నారం బరాజ్‌కు 4 వేల క్యూసెక్కులు వస్తుండగా, మొత్తం 66 గేట్ల ద్వారా అంతే మొత్తంలో వదులుతున్నారు. కాళేశ్వరం పుష్కరఘాట్ వద్ద గోదావరి శనివారం సాయంత్రం 3.41లక్షల క్యూసెక్కుల మేర ప్రవహిస్తున్నది.