Imran Khan | తోషాఖానా కేసు (Toshakhana case)లో పాకిస్థాన్ (Pakistan) మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ (Ex PM Imran Khan) అరెస్టుకు రంగం సిద్ధమైంది. ఈ కేసులో ఇమ్రాన్‌ఖాన్‌పై ఇప్పటికే వారెంట్ జారీ అయ్యింది. ఈ క్రమంలో మాజీ ప్రధానిని అరెస్టు చేసేందుకు ఇస్లామాబాద్ పోలీసులు ఆయన ఇంటికి చేరుకున్నారు. ఆ సమయంలో ఇమ్రాన్ ఇంట్లో లేనట్లుగా పాక్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. మరో వైపు ఇవాళ ఇమ్రాన్ అరెస్టు చేయనున్నట్లు ఇస్లామాబాద్ ఐజీ (Islamabad IG) సైతం ప్రకటించారు. అరెస్టు వార్తల నేపథ్యంలో పీటీఐ (Pakistan Tehreek-e-Insaf) చీఫ్ మద్దతుదారులు పెద్ద ఎత్తున ఆయన ఇంటికి చేరుకున్నారు.
వాస్తవానికి తోషాఖానా కేసు విచారణ కోసం ఇమ్రాన్ కోర్టుకు హాజరుకావాల్సి ఉండగా.. పట్టించుకోకపోవడంతో ఇమ్రాన్‌ను అరెస్టు చేయాలని కోర్టు ఆదేశించింది. ఫిబ్రవరి 28న నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్‌ను అడిషనల్ సెషన్స్ జడ్జి జారీ చేశారు. కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని పోలీసు అధికారులు పేర్కొన్నారు. చట్టపరమైన ప్రొసీడింగ్స్ పూర్తయిన వెంటనే ఇమ్రాన్‌ను అరెస్ట్ చేసే అవకాశం ఉన్నది. అరెస్టుపై ఆ పార్టీ వైస్ ప్రెసిడెంట్ ఫవాద్ చౌదరి స్పందించారు. ఇమ్రాన్‌ను అరెస్ట్ చేస్తే దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపడుతామని షబాద్ షరీఫ్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. దేశం ఇప్పటికే సంక్షోభంలో ఉందని, మరో సంక్షోభంలోకి నెట్టొద్దన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం సున్నితంగా వ్యవహరించాలన్నారు.