హైదరాబాద్, జూన్ 7 (నమస్తే తెలంగాణ): ఈ ఏడాది ఇంటర్ టాపర్లంతా ఇంజినీరింగ్, మెడికల్ వంటి కోర్సులను కాదనుకుని డిగ్రీ కోర్సుల్లో అడ్మిషన్లు పొందారు. వీరంతా ప్రైవేట్ కాలేజీలను కాదని ప్రభుత్వ కాలేజీల్లో చేరుతుండటం విశేషం. ముఖ్యంగా నిజాం కాలేజీ, తెలంగాణ వర్సిటీ (కోఠి మహిళా కాలేజీ)ల్లో డిగ్రీ సీట్లు హాట్కేకులను తలపిస్తున్నాయి. సికింద్రాబాద్ పీజీ కాలేజీ, బేగంపేట మహిళా డిగ్రీ కాలేజీ, సిటీ కాలేజీల్లోని డిగ్రీ సీట్లకు డిమాండ్ తీవ్రంగా ఉంది.
ఈ ఏడాది అడ్మిషన్లు పొందిన వారిలో 44శాతం విద్యార్థులు ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లోనే చేరారు. దోస్త్ మొదటి విడుతలో 76,290 విద్యార్థులు అడ్మిషన్లు పొందితే 34,170 మంది ప్రభుత్వ కాలేజీల్లో చేరారు. అదే ప్రైవేట్ కాలేజీల్లో 42,120 మంది (56శాతం) అడ్మిషన్లు పొందారు. ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు155కి పైగా ఉండగా, ప్రైవేట్ కాలేజీలు 731 ఉన్నాయి. ఇన్టేక్ సీట్ల సంఖ్య సైతం ప్రైవేట్ కాలేజీల్లోనే అధికం. ముఖ్యంగా యూనివర్సిటీ అటానమస్ కాలేజీల్లోని సీట్లలో 71శాతం మొదటి విడుతలోనే భర్తీ అయ్యాయి. రైల్వే డిగ్రీ కాలేజీలో 100శాతం సీట్లు నిండటం విశేషం. అదే ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లోని సీట్లలో కేవలం 22శాతం సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి.
