హైదరాబాద్: తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ లిమిటెడ్ (TOMCOM) సంస్థ తెలంగాణ వాసులకు విదేశాల్లో ఉద్యోగావకాశాలు కల్పించడం కోసం ఈ నెల 29న ఎన్రోల్మెంట్ డ్రైవ్ నిర్వహిస్తున్నది. హైదరాబాద్ విజయనగర్ కాలనీలోని ఐటీఐ కాలేజ్ మల్లేపల్లి క్యాంపస్లో ప్రభుత్వ TOMCOM కార్యాలయంలో ఈ ఎన్రోల్మెంట్ డ్రైవ్ జరుగనుంది.
తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ లిమిటెడ్ (TOMCOM) అనేది తెలంగాణ ప్రభుత్వంలోని కార్మిక, ఉపాధి శిక్షణ, ఫ్యాక్టరీస్ శాఖ పరిధిలో రిజస్టరైన రిక్రూట్మెంట్ ఏజెన్సీ. తెలంగాణలోని స్కిల్డ్, సెమీ స్కిల్డ్ కార్మికులకు ఈ సంస్థ విదేశాల్లో ఉద్యోగావకాశాలు కల్పిస్తుంది. ఈ మేరకు గల్ఫ్ దేశాలతోనే కాకుండా ఆస్ట్రేలియా, కెనడా, జర్మనీ, హంగరీ, జపాన్, పోలాండ్, రోమేనియా, యూకేలతో TOMCOM భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకుంది.
పైప్ ఫిట్టర్స్, ITV డ్రైవర్స్, వెల్డర్స్, స్కాఫోల్డర్స్ తదితర ఉద్యోగావకాశాలను ఈ సంస్థ కల్పిస్తున్నది. ప్రస్తుతం యూఏఈలో బ్లాస్టర్ పెయింటర్, క్లీనర్, జనరల్ హెల్పర్, ఫోర్మాన్ – బ్లాస్టింగ్ అండ్ పెయింటింగ్, ఫోర్మాన్ ప్లేటర్, ITV డ్రైవర్, మలేషియాలో టెక్నికల్ సూపరింటెండెంట్ ఉద్యోగాలు అందుబాటులో ఉన్నాయని TOMCOM తెలిపింది.