మెహిదీపట్నం, సెప్టెంబర్ 1: హైదరాబాద్‌లోని టోలీచౌకీ పోలీస్ స్టేషన్లో ఎస్సైగా పనిచేస్తున్న ఆర్ పాండునాయక్ లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖకు అడ్డంగా దొరికిపోయాడు. వివరాల్లోకి వెళ్తే.. గోల్కొండ జమాలికుంట ప్రాంతానికి చెందిన ఓ కుటుంబంలో గత నెల 28న గొడవ జరిగింది. దీనిపై ఆ కుటుంబసభ్యుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఆ సమస్యను సామరస్యంగా పరిష్కరిస్తానని, ఫిర్యాదుదారుడి తల్లిపై కేను నమోదు చేయకుండా ఉండేందుకు, పాస్‌పోర్టును స్వాధీనం చేసుకోకుండా ఉండేందుకు రూ.10 వేలు లంచం ఇవ్వాలని పాండునాయక్ డిమాండ్ చేశాడు.
మంగళవారం సాయంత్రం ఫిర్యాదుదారుడి నుంచి ఆ లంచాన్ని పుచ్చుకుంటున్న పాండునాయక్‌ను ఏసీబీ డీఎస్పీ మాజిద్ తన బృందంతో కలిసి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అనంతరం ఆయనను రిమాండ్‌కు తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.