నల్లబెల్లి, డిసెంబర్ 27: వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం రుద్రగూడెం పరిసరాల్లో పులి కదలికలు కనిపించాయి. పొలాల్లో పాదముద్రలు గుర్తించిన ప్రజలు అటవీ అధికారులకు సమాచారం ఇచ్చారు. సిబ్బందితో కలిసి అక్కడికి చేరుకున్న ఎఫ్ఆర్వో రవికిరణ్ వాటిని పులి పాదముద్రలుగా నిర్ధారించారు. కొండాపూర్ ఏజెన్సీ ప్రాంతం నుంచి మేడెపల్లి, ఆసరవెల్లి, గొల్లపల్లె, రాంపూర్ గ్రామాల మీదుగా రుద్రగూడెం 365 జాతీయ రహదారిని దాటుకుని గురువారం రాత్రి పంట పొలాల్లో పెద్దపులి సంచరించింది. దాని పాదముద్రలు సోషల్ మీడియాలో వైరల్గా మారడంతోపాటు రైతులు ఫారెస్ట్ అధికారులు అక్కడికి చేరుకుని పెద్దపులి పాదముద్రలుగా తేల్చారు. పులి సంచరించిన పరిసర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎఫ్ఆర్వో, ఎస్సై గోవర్ధన్ ఈ సందర్భంగా సూచించారు.
కోనాపురం అడవుల్లో సంచారం
కొత్తగూడ: మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలోని కోనాపురం అడవుల్లో పెద్దపులి సంచరిస్తున్నదని, మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కొత్తగూడ ఫారెస్ట్ రేంజర్ వజహత్ తెలిపారు. రుద్రగూడెంగ్రామం నుంచి మూడు చెక్కలపల్లి మీదుగా రాత్రి కోనాపురం వైపు వచ్చిందని, ముసలిమడుగు ప్రాంతంలో పాదముద్రలు గుర్తించామని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.