Ramagundam | కోల్సిటీ, మే 24: రామగుండం నగర పాలక సంస్థ అధికారులు, అధికార పార్టీ నేతల తీరు మితిమీరుతుననది. అభివృద్ధి పేరుతో కూల్చివేతల పర్వం వివాదాలకు దారితీస్తున్నది. వివరాల్లోకి వెళితే.. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని మార్కండేయ కాలనీలో రోడ్ల అభివృద్ధి పేరుతో నగర పాలక సంస్థ టౌన్ ప్లానింగ్ అధికారులు శనివారం మూడంతస్తుల భవనాన్ని కాంగ్రెస్ నాయకులు, పోలీస్ పహారా మధ్య ఎక్స్కవేటర్తో కూల్చివేయడం ప్రారంభించారు.
సివిల్ కాంట్రాక్టర్కు చెందిన ఆ భవనాన్ని సదరు యజమాని ముందు రోజు రాత్రి నుంచే స్వచ్ఛందంగా తొలగిస్తున్నాడు. కాంగ్రెస్ నాయకుల పురమాయింపుతో నగరపాలక అధికారులు ఎక్స్కవేటర్ వాహనాలతో అక్కడకు వచ్చి తామే కూల్చివేస్తామని రంగంలోకి దిగారు. ఎలాంటి రక్షణ గానీ, భద్రత గానీ లేకుండా ఎక్స్కవేటర్ డ్రైవర్ ఒక్కో అంతస్తును కూల్చివేస్తుండగా అధికారులు జారుకున్నారు. పోలీసులు, కాంగ్రెస్ నాయకులు, మున్సిపల్ సిబ్బంది ప్రేక్షకపాత్ర వహిస్తున్నారు.
ఇంతలోనే భవనం ఒక్కసారిగా కుప్పకూలగా ప్రధాన రోడ్డుపై ఉన్న విద్యుత్తు తీగెలు, స్తంభాలు ఆ శిథిలాల కింద నేలమట్టమయ్యాయి. ఎక్స్కవేటర్ డ్రైవర్ శిథిలాల కింద చిక్కుకుపోయాడు. అదృష్టవశాత్తు మృత్యుంజయుడై గాయాలతో బయటకు వచ్చాడు. ఎక్స్కవేటర్ శిథిలాల కింద ధ్వంసమైంది. అంత పెద్ద భవనం కూల్చివేసే ముందు ఒక పద్ధతి, ప్రణాళిక, భద్రత లేకుండా కూల్చివేయడంతో అధికారుల తీరుపై ప్రజలు ఆగ్రహం వ్యక్తంచేశారు. భవనం కుప్పకూలే సమయంలో శిథిలాలు ఎగిరి వచ్చి ప్రజల మీద పడి ప్రాణనష్టం జరిగితే బాధ్యులెవరని ప్రశ్నించారు.