TG Weather | తెలంగాణలో మరో రెండుమూడు రోజులు వర్షాలు కొనసాగుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. దక్షిణ ఒడిశా నుంచి గల్ఫ్ ఆఫ్ మన్నార్ వరకు ఉన్న ద్రోణి.. కోస్తాంధ్ర, రాయలసీమ మీదుగా కొమోరిన్ ప్రాంతం వరకు సగటున సముద్రమట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతుందని వాతావరణశాఖ పేర్కొంది.
ఈ క్రమంలో గురువారం భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, వికారాబాద్, నాగర్ కర్నూల్, వనపర్తి, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. శుక్రవారం కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాల్లో.. శనివారం కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేసింది. ఈ క్రమంలో ఆయా జిల్లాలకు వాతావరణశాఖ ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది.