బుధవారం 08 ఏప్రిల్ 2020
Telangana - Mar 12, 2020 , 01:24:51

ఆనంద్‌రెడ్డి హత్యకేసులో ముగ్గురు అరెస్టు

ఆనంద్‌రెడ్డి హత్యకేసులో ముగ్గురు అరెస్టు

దారుణ హత్యకు గురైన ఖమ్మం అసిస్టెంట్‌ లేబర్‌ ఆఫీసర్‌ మోకు ఆనంద్‌రెడ్డి(45) కేసులో ముగ్గురిని అరెస్ట్‌ చేసినట్టు వరంగల్‌ పొలీస్‌ కమిషనరేట్‌ లా అండ్‌ ఆర్డర్‌ అదనపు డీసీపీ మల్లారెడ్డి తెలిపారు. బుధవారం సాయంత్రం హన్మకొండ పొలీస్‌స్టేషన్‌లో మీడియాకు వివరాలు వెల్లడించారు.

  • పరారీలో మరో ముగ్గురు అదనపు డీసీపీ మల్లారెడ్డి వెల్లడి

వరంగల్‌ క్రైం: దారుణ హత్యకు గురైన ఖమ్మం అసిస్టెంట్‌ లేబర్‌ ఆఫీసర్‌ మోకు ఆనంద్‌రెడ్డి(45) కేసులో ముగ్గురిని అరెస్ట్‌ చేసినట్టు వరంగల్‌ పొలీస్‌ కమిషనరేట్‌ లా అండ్‌ ఆర్డర్‌ అదనపు డీసీపీ మల్లారెడ్డి తెలిపారు. బుధవారం సాయంత్రం హన్మకొండ పొలీస్‌స్టేషన్‌లో మీడియాకు వివరాలు వెల్లడించారు. ఆయన కథనం మేరకు.. ఖమ్మంలో అసిస్టెంట్‌ లేబర్‌ ఆఫీసర్‌గా పని చేస్తున్న ఆనంద్‌రెడ్డికి, వరంగల్‌ అర్బన్‌ జిల్లా శనిగరం గ్రామానికి చెందిన పింగిళి ప్రదీప్‌రెడ్డికి గతంలో ఓ భూమి కొనుగోలు విషయంలో పరిచయం ఏర్పడింది. అప్పటి నుంచి ఇద్దరి మధ్య ఆర్థికలావాదేవీలు కొనసాగుతున్నాయి. 


ఈ క్రమంలో ఆనంద్‌రెడ్డి నుంచి ప్రదీప్‌రెడ్డి లక్షల్లో డబ్బు అప్పుగా  తీసుకున్నాడు. తిరిగి చెల్లించే విషయంలో ఇద్దరికి భేదాభిప్రాయాలు ఏర్పడ్డాయి. అప్పు ఎగ్గొటేందుకు ఆనంద్‌రెడ్డిని చంపాలని ప్రదీప్‌రెడ్డి పథకం రచించాడు. డబ్బుకు బదులు భూమి ఇస్తానని నమ్మించి ఆనంద్‌రెడ్డిని ఈ నెల 7న డ్రైవర్‌ రమేశ్‌, మరో వ్యక్తి విక్రమ్‌రెడ్డితో కలిసి ప్రదీప్‌రెడ్డి భూపాలపల్లిజిల్లా రాంపూర్‌కు తీసుకెళ్లాడు. ఈ క్రమంలో కారులోనే ఆనంద్‌రెడ్డి చేతులు వెనక్కి కట్టి తలకు ప్లాస్టర్‌ చుట్టారు. అడవిలోని గట్టమ్మగుడి వద్ద అప్పటికే సిద్ధంగా ఉన్న వెంగళి శివరామకృష్ణ, మీనుగు మధూకర్‌, నిగ్గుల శంకర్‌కు ఆనంద్‌రెడ్డిని అప్పగించి కత్తులను సైతం అందించారు. 


శివరామకృష్ణ ఆనంద్‌రెడ్డి గొంతు కోసి మిగతా ఇద్దరితో కలిసి అక్కడి నుంచి పరారయ్యాడు. 7వ తేదీ మధ్యాహ్నం నుంచి తన అన్న కనిపించడం లేదని ఆనంద్‌రెడ్డి సోదరుడు శివకుమార్‌రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. హన్మకొండ పబ్లిక్‌ గార్డెన్‌ సమీపంలో ప్రదీప్‌రెడ్డి అనుచరుడు శివరామకృష్ణ వాహనంలో పారిపోతున్నాడన్న పక్కా సమాచారంతో మంగళవారం అతన్ని అదుపులోకి తీసుకొని విచారించగా ప్రదీప్‌రెడ్డి ఆదేశాలతోనే ఆనంద్‌రెడ్డిని హత్యచేసినట్టు ఒప్పుకున్నాడు. శివరామకృష్ణను వెంటతీసుకొని పోలీసులు రాంపూర్‌ అడవికి వెళ్లగా ఆనంద్‌రెడ్డి మృతదేహం లభించింది. శివరామకృష్ణ చెప్పిన వివరాలతో మధూకర్‌, శంకర్‌ను కూడా ఆదుపులోకి తీసుకొన్నట్టు అదనపు డీసీపీ మల్లారెడ్డి తెలిపారు. మరో ముగ్గురు ప్రస్తుతం పరారీలో ఉన్నారని తెలిపారు.  


logo