హైదరాబాద్, జూలై 13(నమస్తే తెలంగాణ): సినీ తారలపై అసభ్యకర వ్యాఖ్యలు చేస్తూ వారి కుటుంబ, వ్యక్తిగత విషయాలపై దుష్ప్రచారం చేస్తున్న ఐదు యూట్యూబ్ చానళ్లను రద్దు చేయించినట్టు మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ శనివారం ఎక్స్ వేదికగా ప్రకటించింది. జస్ట్వాచ్ బీబీసీ, ట్రోల్స్రాజా, బచినా లలిత్, హైదరాబాద్ కుర్రాడు, ఎక్స్వైజెడ్ ఎడిట్స్ 007 చానళ్లు ఈ టర్మినేట్ జాబితాలో ఉన్నాయి.
ఇది ఆరంభం మాత్రమేనని, మున్ముందు మరిన్ని చర్యలుంటాయని ‘మా’ పేర్కొంది. నటీనటుల వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించే చానళ్లు పద్ధతి మార్చుకోవాలని, 48 గంటల్లో అసభ్యకర వీడియోలను తొలగించకపోతే చర్యలు తీసుకుంటామని ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు క్రితం సోషల్మీడియాలో హెచ్చరించారు. సదరు చానళ్ల శైలిలో మార్పు రాకపోవడంతో ‘మా’ అసోసియేషన్ యూట్యూబ్ సంస్థ ఫిర్యాదు చేయగా, వారి విధానాలకు అనుగుణంగా చర్యలు తీసుకున్నది.