హైదరాబాద్, మే 15 (నమస్తే తెలంగాణ): ఏపీ విద్యార్థులకు తెలంగాణలో అడ్మిషన్లు కల్పించే కామన్ అడ్మిషన్ల గడువు ఈ విద్యాసంవత్సరంతో ముగియనున్నది. ఇందుకు పదేండ్ల గడువువిధించగా వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఏపీ కోటా అడ్మిషన్లకు బ్రేక్పడనున్నది. మొత్తం సీట్లు తెలంగాణ బిడ్డలకే దక్కనున్నాయి. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం ప్రొఫెషనల్ కోర్సుల్లో ఉమ్మడి అడ్మిషన్లకు పదేండ్ల గడువు విధించారు. దీంతో ఎప్‌సెట్ (ఎంసెట్), ఐసెట్, ఎడ్‌సెట్, పీజీఈసెట్, ఈసెట్, పీఈసెట్ వంటి ప్రవేశ పరీక్షల కన్వీనర్ కోటాలోని ఓపెన్ కోటా సీట్లకు ఏపీ విద్యార్థులు పోటీ పడే అవకాశాన్నిచ్చారు. ఇందుకు ప్రభుత్వం 2014లో జీవోను జారీ చేయగా, జూన్ 2తో గడువు ముగియనున్నది. రాష్ట్రం లో ఇప్పటికే అన్ని రకాల ప్రవేశ పరీక్షల నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. ఈసెట్, ఎప్‌సెట్ పరీక్షలు ముగియగా, ఐసెట్, ఎడ్‌సెట్, పీజీఈసెట్, లాసెట్ వంటి ప్రవేశ పరీక్షలు జరగాల్సి ఉంది. వాస్తవానికి ఉమ్మడి అడ్మిషన్ల గడువు నిరుడితోనే ముగియాల్సి ఉన్నా.. జూన్ నుంచి జూన్ వరకు విద్యాసంవత్సరం ఉంటుంది. 2024-25లో నోటిఫికేషన్లు అన్ని జూన్‌కు ముందే విడుదలకావడంతో ఈ ఏడాది సాంకేతికంగా అవకాశం లభించింది.
చివరి సంవత్సరం భారీ స్పందన
ఈ ఏడాది టీఎస్ ఎప్‌సెట్ సహా పలు ప్రవేశ పరీక్షలకు ఏపీ విద్యార్థుల నుంచి భారీ స్పందన వచ్చింది. చివరి సంవత్సరం కావడంతో పోటీపడి దరఖాస్తులు సమర్పించారు. ఈ ఏడాది ఎప్‌సెట్‌కు 3.5 లక్షల దరఖాస్తులు రాగా, ఏపీ నుంచే లక్షకు పైగా వచ్చాయి. 2023లో 72 వేల మంది ఏపీకి చెందిన వారు దరఖాస్తు చేయగా, 2022లో 36వేలకు పైగా దరఖాస్తు చేశారు. ఈ ఏడాది 30వేలకు పైగా అధికంగా దరఖాస్తులొచ్చాయి.
సీట్ల కేటాయింపు ఇలా..
ఎప్సెట్లోని సీట్లల్లో 70 శాతం సీట్లు కన్వీనర్ కోటాలో భర్తీచేస్తారు. ఈ సీట్లల్లో ఓపెన్కోటాలోని సీట్లకు ఏపీ విద్యార్థులు దక్కించుకోవచ్చు. మొత్తం సీట్లు ఏపీ వారికే కేటాయించరు. మెరిట్ ప్రకారం తెలంగాణ, ఏపీ రెండు రాష్ర్టాల విద్యార్థులు ఈ సీట్లను ఈ విద్యాసంవత్సరం దక్కించుకుంటారు. బీఈడీ, లా కోర్సుల్లో 20 శాతం మేనేజ్మెంట్ కోటా సీట్లు మినహాయిస్తే 80 శాతం సీట్లు కన్వీనర్ కోటాలో భర్తీచేస్తారు. ఓపెన్ కోటా సీట్లకు ఏపీవాళ్లు ఈ ఒక్క ఏడాది పోటీపడవచ్చు. 2025-26 నుంచి మాత్రం మొత్త సీట్లను మన వాళ్లే సొంతం చేసుకుంటారు. ఐసెట్‌లో మేనేజ్మెంట్ కోటా 25 శాతముండగా, మిగిలిన 75శాతం సీట్లు కన్వీనర్ కోటాలో భర్తీచేస్తారు. ఈ కన్వీనర్ కోటా సీట్లల్లో ఓపెన్‌కోటా సీట్లు వచ్చే విద్యాసంవత్సరం మన తెలంగాణ బిడ్డలకే దక్కుతాయి.