హైదరాబాద్, జూన్ 8 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ సాగునీటిశాఖ సలహాదారుడిగా విశ్రాంత ఐఏఎస్ ఆదిత్యనాథ్‌దాస్ నియామకంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తెలంగాణ సాగునీటి రంగనిపుణులు, రాష్ట్ర ఇంజినీర్లు ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుబడుతున్నారు. ఆదిత్యనాథ్‌దాస్ నియామకం తెలంగాణ నీటిహక్కులకు గొడ్డలిపెట్టు అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర విభజన సమయంలో ఆదిత్యనాథ్‌దాస్‌ను ఏపీకి కేటాయించారు. తొలుత చంద్రబాబు హయాంలో ఐదేండ్లు, ఆ తరువాత జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంలో చీఫ్‌సెక్రటరీగా ఆయన పనిచేశారు. పదవీ విరమణ పొందిన అనంతరం ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రతినిధిగా కొనసాగారు. గత పదేండ్లు ఆయన ఏపీ ప్రభుత్వ సేవలోనే ఉన్నారు. ఈ కాలంలో తెలంగాణ నీటిహక్కులను కాలరాసేందుకు ఏపీ ప్రభుత్వం తరఫున ఆదిత్యనాథ్‌దాస్ కీలకంగా పనిచేశారంటూ ఇప్పుడు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ ఏర్పడిన అనంతరం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలు, కాళేశ్వరం, సమ్మక్కసాగర్ వంటి పలు ప్రాజెక్టులను వ్యతిరేకిస్తూ ఏపీ ప్రభుత్వం తరఫున ఆదిత్యనాథ్‌దాస్ కేంద్రానికి అనేక లేఖలు రాశారు. కృష్ణా జలాల వాటాల విషయంలోనూ కొర్రీలు వేశారు.
జగన్మోహన్రెడ్డి హయాంలో ఏకంగా రాయలసీమ ఎత్తిపోతల పథకం చేపట్టడంలోనూ కీలకంగా వ్యవహరించారు. ఢిల్లీలోనూ తెలంగాణ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా ఏపీ ప్రభుత్వం తరఫున కేంద్రంతో అనేకవిధాలుగా పైరవీలు చేశారు. అలాంటి వ్యక్తిని ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఏకంగా సాగునీటి పారుదలశాఖకు సలహాదారుడిగా నియమించడంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. కృష్ణా ట్రిబ్యునల్ వాదనలు కొనసాగుతున్న ప్రస్తుత సమయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తెలంగాణ నీటి హక్కులకు తీరని విఘాతమని నిపుణులు, ఇంజినీర్లు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ప్రభుత్వ సలహదారుడిగా నియమించేందుకు రాష్ట్రంలో సమర్థులు ఎవరూ లేరా? లేక కనిపించలేదా? అంటూ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకోవాలని, ఆదిత్యనాథ్ దాస్ నియామకాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
తెలంగాణ నీటి పారుదలశాఖ సలహాదారు పదవి నుంచి ఆదిత్యనాథ్‌దాస్‌ను ప్రభుత్వం వెంటనే తొలగించాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఆదేశానుసారం, ఆయన శిష్యుడు సీఎం రేవంత్ నడుచుకుంటున్నారని అందులో భాగంగానే ఆదిత్యనాథ్‌దాస్ నియామకం జరిగిందని ఆరోపించారు. తెలంగాణపై చంద్రబాబు కర్రపెత్తనం మొదలైందనడానికి ఈ నియామకమే నిదర్శనమని మండిపడ్డారు. రేవంత్‌రెడ్డి తెలంగాణకు రుణపడి ఉంటాడా? లేక చంద్రబాబు ఆదేశాల మేరకు నడుచుకుంటారా? అని నిలదీశారు. జలయజ్ఞం ప్రాజెక్టులు, పాలమూరు రంగారెడ్డిపై కేసులు వేసి పనులు ఆపిన వ్యవహారంలో ఆదిత్యనాథ్ది కీలకపాత్రని తెలిపారు. అటువంటి వ్యక్తికి తెలంగాణ నీటి పారుదలశాఖ సలహాదారు పదవి ఎందుకు కట్టబెట్టారో ప్రభుత్వం వివరణనివ్వాలని డిమాండ్ చేశారు. ఏ ప్రయోజనాల కోసం ఈ పదవిలో కూర్చోబెట్టారని నిలదీశారు. వ్యక్తిగతంగా ఒక ప్రభుత్వ అధికారిగా ఆయనపై తమకు ఎలాంటి వ్యతిరేకత లేదని స్పష్టం చేశారు. అయితే ఆంధ్రాకు కృష్ణా ప్రాజెక్టుల నుంచి నీటిని తరలించడంలో కీలకపాత్ర పోషించిన, గత పదేండ్లుగా తెలంగాణకు వ్యతిరేకంగా ఏపీ తరపున కొట్లాడిన వ్యక్తి.. ఇప్పుడు తెలంగాణకు న్యాయం చేస్తారా? అని నిలదీశారు. కేఆర్ఎంబీలో తెలంగాణ వాదనను తొకిపట్టి ప్రాజెక్టుల మీద హకులు కోల్పోయేలా చేసిన వ్యక్తిని నియమించడంలో కాంగ్రెస్ ఆలోచన ఏమిటని ప్రశ్నించారు. కాంగ్రెస్ పాలనలో పాలమూరు మరోసారి ఎడారి అయ్యేలా ఉన్నదని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఆదిత్యనాథ్‌ను సలహాదారు పదవి నుండి తొలగించాలని నిరంజన్‌రెడ్డి డిమాండ్ చేశారు.