హైదరాబాద్, ఫిబ్రవరి 4 (నమస్తే తెలంగాణ): అవిభక్త కవలలు వీణవాణి తల్లిదండ్రుల వద్దే ఉన్నందున వాళ్లను స్టేట్ హోంకు తరలించాల్సిన అవసరం లేదని హైకోర్టు స్పష్టంచేసింది. భవిష్యత్తులో ఆ పిల్లలకు అయ్యే వైద్య ఖర్చులను ప్రభుత్వమే భరించాలని చెప్పింది. పిల్లలకు నెలకు రూ.15 వేలు చొప్పున ఆర్థికసాయం అందజేసేందుకు హెల్పింగ్ హ్యాండ్స్ ఫౌండేషన్‌కు అనుమతి ఇచ్చింది. ఆ సంస్థను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీశ్‌చంద్రశర్మ, జస్టిస్ అభినంద్‌కుమార్ షావిలి ధర్మాసనం అభినందించింది. వీణవాణిలను వేరుచేసేలా ఉత్తర్వులు ఇవ్వాలని, వాళ్ల కుంటుంబాన్ని ప్రభుత్వం ఆదుకునేలా ఉత్తర్వులు ఇవ్వాలని ఫౌండేషన్ దాఖలు చేసిన పిల్‌పై శుక్రవారం మరోసారి విచారణ జరిపింది. వీణవాణి 9 ఏండ్లు నీలోఫర్ లోనే ఉన్నారని, విదేశీ వైద్యులను కూడా ప్రభుత్వం తీసుకొచ్చిందని, వేరుచేస్తే వాళ్ల ప్రాణాలకు ముప్పు ఉంటుందని వైద్యులు చెప్పారని, దీంతో వాళ్లను తల్లిదండ్రులకు అప్పగించామని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది సంజీవ్‌కుమార్ చెప్పారు. తండ్రి ఆటోడ్రైవరని, వీణావాణి ఇంటర్మీడియట్ చదువుతున్నారని తెలిపారు. ఫౌండేషన్ పలు సేవాకార్యక్రమాలను నిర్వహిస్తున్నదని హైకోర్టు దృష్టికి తెచ్చారు. పిల్లలకు సాయం చేసేందుకు అనుమతి ఇవ్వాలని ఫౌండేషన్ చేసిన వినతిని హైకోర్టు ఆమోదించి పిల్‌పై విచారణ ముగిసినట్లు ప్రకటించింది.