వెంగళరావునగర్, ఆగస్టు 5 : మధురానగర్ ఠాణా నుంచి ఓ దొంగ రెండోసారి పారిపోయాడు. అతడు తప్పించుకున్నాడా? లేక పోలీసులే తప్పించారా? అని స్థానికులు అనుమానం వ్యక్తంచేస్తున్నారు. చోరీలతో విసుగుచెంది అతికష్టం మీద దొంగను పట్టుకొని పోలీసులకు అప్పగిస్తే వారి తీరుతో అతడు మళ్లీ బయటపడ్డాడని విమర్శిస్తున్నారు. షాద్‌నగర్‌లో చేయని నేరానికి ఓ మహిళను దొంగను చేసి పోలీసులు ఇష్టంవచ్చినట్టు కొట్టారని, ఇక్కడ మాత్రం దొంగతనం చేసినట్టు రుజువులున్నా దొంగను వదిలేశారని మండిపడుతున్నారు. యూసుఫ్‌గూడ చెక్‌పోస్ట్ సమీపంలోని యాదగిరినగర్ బస్తీలోని ఇండల్లో వాటర్ ట్యాప్‌ల చోరీలతో జనం బేజారయ్యారు.
పోలీసులకు చెప్పినా వినే పరిస్థితి లేకపోడంతో తామే రంగంలోకి దిగారు. దొంగను ఎలాగైనా పట్టుకోవాలని నిర్ణయించుకున్నారు. ఓచోట దొంగ చోరీ చేస్తుండగా సీసీ కెమెరాల్లో నమోదు కావడంతో బస్తీవాసులు ఆ ఫుటేజీని తమ వాట్సాప్ గ్రూపుల్లో పోస్ట్‌చేసి అందర్నీ అలర్ట్ చేశారు. ఆగస్టు 1న గట్టి నిఘాపెట్టి దొంగను యాదగిరినగర్ కమిటీ సభ్యులు పట్టుకున్నారు. అతడు నేపాల్‌కు చెందిన వికాస్‌గా గుర్తించారు. దేహశుద్ధి చేసి మధురానగర్ పోలీసులకు అప్పగిస్తే అదేరోజు పరారయ్యాడు. పోలీసులు గాలించి మళ్లీ జూబ్లీహిల్స్ ప్రాంతంలో శుక్రవారం రెండోసారి అదుపులోకి తీసుకుని ఠాణాలో ఉంచారు. కాగా ష్టేషన్ నుంచి ఆదివారం సాయంత్రం సదరు దొంగ మళ్లీ పారిపోవడంతో విధినిర్వహణలో పోలీసుల నిర్లక్ష్యంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.