వరంగల్ చౌరస్తా, ఏప్రిల్ 11 : తెలంగాణ అకాడమీ ఆఫ్ స్కిల్స్ అండ్ నాలెడ్జ్ (టాస్క్) ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన జాబ్‌మేళాలో తొక్కిసలాట జరిగింది. ముగ్గురు యువతకులకు గాయాలయ్యాయి. శుక్రవారం వరంగల్ తూర్పు నియోజకవర్గ పరిధి రైల్వేస్టేషన్ గూడ్స్‌షెడ్ జంక్షన్‌లోని ఎంకే నాయడు హోటల్స్ అండ్ కన్వెన్షన్ హాల్లో నిర్వహించిన జాబ్‌మేళాకు పెద్ద ఎత్తున నిరుద్యోగులు తరలివచ్చారు. 6 వేల ఉద్యోగాలకు ఎంపిక జరుగుతుందని ప్రకటించడంతో నిరుద్యోగులు భారీ సంఖ్యలో చేరుకున్నారు.
మంత్రులు కొండా సురేఖ, సీతక్క ఆలస్యంగా రావడం, కార్యక్రమాన్ని ప్రారంభించి, ప్రసంగాలు పూర్తయ్యే వరకు నిరుద్యోగులను లోనికి అనుమతించకపోవడంతో హోటల్ ఆవరణ పూర్తిగా నిరుద్యోగులతో నిండిపోయింది. హోటల్ గేట్లు మూసివేశారు. మంత్రులు తమ ప్రసంగాన్ని ముగించుకొని వెళ్లిపోయాక నిరుద్యోగులను లోనికి అనుమతించడంతో ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది. ఈ క్రమంలో హోటల్ ముఖద్వారం వద్ద ఏర్పాటు చేసిన భారీ అద్దాలు పగిలిపోయి ముగ్గురు యువతులకు గాయాలయ్యాయి. ఒక్కసారిగా అద్దాలు కిందపడటంతో నిరుద్యోగులు భయభ్రాంతులకు గురై హాహాకారాలు చేశారు. వెంటనే పోలీసులు వారిని నిలువరించి గాయపడిన యువతులను హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందించారు.
పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళన ద్వారా నోటిఫికేషన్లు వస్తూనే ఉన్నాయి. అది ఏ స్థాయికి వెళ్లిందంటే.. ఒకప్పుడు నోటిఫికేషన్లు కావాలని ధర్నా చేసే పరిస్థితి ఉండేది. ఇప్పుడు నోటిఫికేషన్లు పెద్దఎత్తున రావడంతో.. కొంచెం గ్యాప్ ఇవ్వండని నిరుద్యోగులు అంటున్నారు. నోటిఫికేషన్లు వద్దని నిరుద్యోగులు ఆందోళనలు చేసే స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్లు ఇస్తున్నది.