హైదరాబాద్, జూలై 12 (నమస్తే తెలంగాణ): డిగ్రీలో ప్యూర్సైన్స్ కోర్సులను బోధించే లెక్చరర్ పోస్టుల భర్తీ ఇక నుంచి ఉండకపోవచ్చు. భవిష్యత్తులోనూ ఈ పోస్టులను భర్తీ చేసే అవకాశాలు కనిపించడంలేదు. ఈ కోర్సుల్లో విద్యార్థులు అంతంత మాత్రంగానే చేరుతుండటంతో కొత్త లెక్చరర్ పోస్టుల భర్తీలో అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్యూర్ సైన్స్ కోర్సులకు బదులు అప్లయిడ్ సైన్స్ సబ్జెక్టుల్లోని పోస్టులనే భర్తీచేయాలన్న నిర్ణయానికి వచ్చారు.
డిగ్రీలో ఫిజిక్స్, కెమిస్ట్రీ, జువాలజీ, బోటనీ, మైక్రో బయాలజీ, ఎన్విరాన్మెంటల్ సైన్స్ వంటి కోర్సులను ప్యూర్సైన్స్ కోర్సులంటారు. కంప్యూటర్ సైన్స్ అండ్ అప్లికేషన్, బయోటెక్నాలజీ, ఫుడ్టెక్నాలజీ వంటి కోర్సులను అప్లయిడ్ సైన్స్ కోర్సులంటారు. అధికారిక సమాచారం మేరకు కొత్తగా 600 డీఎల్ పోస్టులను భర్తీచేయనునట్టు తెలుస్తున్నది. వాటిలో 320కిపైగా కంప్యూటర్ సైన్స్ పోస్టులే ఉన్నాయి. ఫిజిక్స్, కెమిస్ట్రీ వంటి సబ్జెక్టుల పోస్టులు ఒక్కటంటే ఒక్కటి కూడా లేకపోవడం గమనార్హం.