Coronavirus | హైదరాబాద్ సిటీబ్యూరో, మే 27(నమస్తే తెలంగాణ): కరోనా మళ్లీ కలవరపెడుతున్నది. దేశంలో రోజురోజుకు కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. దీంతో ప్రజలు కొంత భయాందోళనకు గురవుతున్నారు. అయిపోయిందనుకున్న కరోనా మళ్లీ వ్యాపిస్తుండటంతో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఉస్మానియా వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రాజారావు వివరించారు. ప్రస్తుతం ఒమిక్రాన్ వేరియంట్ పూర్తిగా కనుమరుగైందని చెప్పారు. దాని ఉప వేరియంట్లు ఎంసీ1.10.1, ఎల్బీ1.3.1, ఎల్ఎఫ్7 మాత్రమే ఉనికిలో ఉన్నాయని తెలిపారు. ఈ ఉప వేరియంట్ల నుంచి వచ్చిన జేఎన్.1, ఎల్పీ 8.1, ఎక్స్ఎఫ్పీ, ఎక్స్ఈసీ వేరియంట్లే ప్రస్తుతం వ్యాపిస్తున్నట్టు వెల్లడించారు. ఇందులోనూ ఎల్పీ 8.1 వేరియంటే 70 శాతం వ్యాపిస్తున్నదని పేర్కొన్నారు. ఈ వేరియంట్ల వల్ల పెద్దగా ప్రమాదమేమీ ఉండదని చెప్పారు.
‘గతంలో కరోనా వేరియంట్లు చాలా వచ్చాయి. వాటిలో ఒమిక్రాన్ వేరియంట్ వేగంగా వ్యాప్తిచెందింది. కానీ దాని తీవ్రత చాలా తక్కువ. ఇప్పుడు వ్యాప్తి చెందుతున్న వేరియంట్లు కూడా ఒమిక్రాన్ నుంచి పుట్టుకొచ్చినవే. కాబట్టి వీటి తీవ్రత కూడా చాలా తక్కువగా ఉంటుంది. భయాందోళనకు గురికావాల్సిన అవసరం లేదు. ఒకవేళ కరోనా సోకినా దవాఖానల్లో చేరే అంత తీవ్రత ఉండదు. ఆ పరిస్థితే రాదు’ అని డాక్టర్ రాజారావు తెలిపారు.
ప్రస్తుతం కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని సూచించారు. ముఖ్యంగా దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, వృద్ధులు, చిన్నపిల్లలు, గర్భిణులు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. ప్రస్తుతం వర్షాలు కురుస్తున్నాయని, ఇలాంటి సమయంలో జలుబు, దగ్గు సహజమేనని తెలిపారు. ఇవి కాకుండా ఒళ్లునొప్పులు, నీరసం వంటి లక్షణాలు ఉంటే కరోనా టెస్ట్ చేయించుకోవడం ఉత్తమమని రాజారావు సూచించారు. ఒకవేళ కరోనా అని తేలితే ఐసోలేషన్ పాటించాలని, డాక్టర్ సలహా మేరకు ఔషధాలు వాడాలని కోరారు.