హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, జూన్ 23 (నమస్తే తెలంగాణ): ఒక అబద్ధాన్ని పదేపదే చెప్పడం ద్వారా అది నిజమవుతుందనే చంద్రబాబు భ్రమ ఇప్పటిది కాదు! నాలుగు శతాబ్దాల చరిత్ర ఉన్న హైదరాబాద్‌ను తానే నిర్మించానంటూ నేటికీ ఆయన డాబును ప్రదర్శిస్తూనే ఉంటాడు. ఎందుకంటే.. ఏదో ఒకరోజు ఒక్కరైనా దీన్ని నమ్మకపోతారా? అనే అత్యాశ! తాజాగా గోదావరి జలాలపైనా గోబెల్స్ బాబు అదే భ్రమలో ఉన్నారు. ఓవైపు సాక్షాత్తూ కేంద్ర జల సంఘం, నేషనల్ వాటర్ డెవలప్మెంట్ ఏజెన్సీ (ఎన్‌డబ్ల్యూడీఏ)తోపాటు సాగునీటి రంగ నిపుణులు సైతం మిగులు జలాలే లేవని బల్లగుద్ది చెప్తున్నా బాబు తీరు మాత్రం మారడం లేదు. తాజాగా సోమవారం ‘ఏడాది పాలన’ సందర్భంగా అమరావతిలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలోనూ సముద్రంలోకి పోయే 3 వేల వృథా జలాల్లో కేవలం 200 టీఎంసీలను వాడుకుంటూ బనకచర్లను చేపడుతున్నామంటూ అదే అబద్ధాన్ని పునరావృతం చేశారు.
కేంద్ర జల సంఘం 1966-67 నుంచి 2012-13 వరకు వచ్చిన ఇన్‌ఫ్లోలను మదించి ఏడాదిలో కేవలం నాలుగు నెలల్లోనే 70-80 శాతం వరద ఉంటుందని తేల్చింది. మిగిలిన ఎనిమిది నెలల్లో కేవలం 20-30 శాతం వరద మాత్రమే ఉంటుందని స్పష్టంచేసింది. పైగా సరాసరిన ఏడాదిలో వచ్చే వరద 2638 టీఎంసీలు ఉంటుందని శాస్త్రీయంగా బయటపెట్టింది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు దిగువన మిగులు జలాలు లేకపోగా 157 టీఎంసీల లోటు ఉన్నదని ఎన్‌డబ్ల్యూడీఏ తేల్చగా అసలు మిగులే లేదని కేంద్ర జల సంఘం కూడా స్పష్టం చేసింది. ఇన్ని నివేదికలు, ఆధారాలు ఉన్నా చంద్రబాబు తీరు మారడం లేదు.
పదేపదే అబద్ధాన్ని చెప్పి తన అనుకూల మీడియా ద్వారా ప్రచారం చేయించే కుటిలయత్నం చేసి తద్వారా కేంద్ర అనుమతులతో బనకచర్ల అక్రమ ప్రాజెక్టును సక్రమం చేసుకోవాలని చూస్తున్నారు. ముఖ్యంగా గోదావరిలో భారీ ఇన్‌ఫ్లోలు ఉండే నాలుగు నెలలపాటు ఇటు తెలంగాణ గానీ, అటు ఏపీ గానీ నీటిని మళ్లించుకునే అవకాశం, అవసరం ఉండదు. బోర్డుల, అథారిటీల నియంత్రణలోకి గోదావరి ప్రాజెక్టులను తెచ్చి వాటి ద్వారా మిగిలిన ఎనిమిది నెలల్లో వచ్చే మోస్తరు, స్వల్ప ఇన్‌ఫ్లోలను కూడా సీమాంధ్రకు మళ్లించుకు పోతారనేందుకు కృష్ణా బేసిన్ అనుభవం కండ్ల ముందే ఉన్నది.