(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, మే 20 (నమస్తే తెలంగాణ): సుప్రీంకోర్టు నిర్ణయాన్ని కాదని కేంద్రం ఆర్డినెన్స్ తీసుకురావడంపై న్యాయకోవిదులు పలు విశ్లేషణలు చేస్తున్నారు. పార్లమెంట్లో చట్టాన్ని తీసుకురావడం ద్వారా కోర్టు తీర్పు ప్రభావాన్ని తగ్గించే అవకాశం లేకపోలేదని చెబుతున్నారు. అయితే, తీర్పులో న్యాయస్థానం ప్రస్తావించిన కీలక అంశాలను సంతృప్తిపరిచే విధంగా చట్టంలో విధివిధానాలు ఉంటేనే ఇది సాధ్యమవుతుందని అభిప్రాయపడుతున్నారు. కేంద్రం చర్యలు ఏకపక్షంగా ఉన్నట్టు అనిపిస్తే, పార్లమెంట్ ఉభయసభల్లో విపక్షాలు అది చట్టంగా మారకుండా అడ్డుకోవచ్చని చెబుతున్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 239ఏఏకు లోబడి కోర్టు ఆదేశాలు ఉన్నాయని, కేంద్రం ఆర్డినెన్స్ ద్వారా వాటికి సవరణలు చేస్తే, కోర్టు ధిక్కరణ కిందకు రాకపోవచ్చని పేర్కొంటున్నారు.