హైదరాబాద్, ఆగస్టు 2 (నమస్తే తెలంగాణ): వైద్య రంగంలో సూపర్ స్పెషాల్టి సీట్లకు మస్తు క్రేజ్. సీటు సంపాదించాలంటే లక్షల మందిని దాటి మంచి మార్కులు తెచ్చుకోవాలి.. ఇదంతా ఒకప్పుడు. ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. పరీక్ష రాస్తే చాలు.. ఒక్క మార్కు రాకపోయినా సరే.. సీటు ఇచ్చేస్తామంటూ మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ (ఎంసీసీ) ప్రకటించింది.
దేశవ్యాప్తంగా భారీగా సీట్లు మిగిలిపోవడమే ఇందుకు కారణం. దేశవ్యాప్తంగా సుమారు 4,500 సూపర్ స్పెషాల్టీ సీట్లు ఉన్నాయి. నీట్ సూపర్ స్పెషాలిటీ-2021 కౌన్సిలింగ్ను ఇప్పటివరకు నాలుగు సార్లు నిర్వహించారు. చివరిసారిగా మొదటి మాప్అప్ కౌన్సిలింగ్లో 15 శాతం మార్కులు వచ్చినవారికి అనుమతి ఇచ్చారు. అయినా 748 సీట్లు మిగిలిపోయాయి. తెలంగాణలోనే సుమారు 40 సీట్లు ఖాళీగా ఉన్నాయి. దీంతో త్వరలో మరో స్పెషల్ మాపప్ కౌన్సిలింగ్ నిర్వహించాలని ఎంసీసీ నిర్ణయించింది. సున్నా మార్కులు వచ్చినవారికి సైతం సీటు ఇస్తామని ఆఫర్ చేసింది.