హైదరాబాద్ : కేసీఆర్ హయాంలో చేపట్టిన ప్రాజెక్టులపై కాంగ్రెస్ పార్టీ పచ్చి అబద్దాలు చెబుతోందని నీటిపారుదల రంగ నిపుణుడు శ్రీధర్‌రావు దేశ్‌పాండే అన్నారు. సీడబ్ల్యూసీ సూచనల మేరకు గోదావరి నదిపై మేడిగడ్డను ఎంపిక చేసి పూర్తి చేశారని పేర్కొన్నారు. మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణంలో నాణ్యతా లోపాలు లేవని పునరుద్ఘాటించారు.
తెలంగాణ జాగృతి (Telangana Jagruthi) ఆధ్వర్యంలో శుక్రవారం హైదరాబాద్‌లో నిర్వహించిన ‘నీళ్లు- నిజాలు ’ అనే అంశంపై నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణలో కేసీఆర్ చేపట్టిన ప్రాజెక్టుల వల్ల పంటల ఉత్పత్తితో పాటు మత్స్య సంపద, పశు సంపద గణనీయంగా పెరిగిందని అన్నారు. సాగునీటి సౌకర్యం కారణంగా రాష్ట్రంలోరైతుల ఆత్మహత్యలు ( Farmers Suicide ) తగ్గాయని వెల్లడించారు.
జలవనరుల విషయంలో కేసీఆర్ ద్విముఖ వ్యూహాన్ని అవలంభించి రాష్ట్రాన్ని సస్యశామలం చేశారని కొనియాడారు. మిషన్ కాకతీయ కార్యక్రమాన్ని ప్రజా ఉద్యమంగా మలచడం వల్ల సత్పలితాలు వచ్చాయని పేర్కొన్నారు. తెలంగాణ రైతాంగానికి ప్రాణధారగా ఉన్న చెరువులను పునరుద్ధించుకున్నామని అన్నారు. ఉమ్మడి పాలనలో చెరువులు, ప్రాజెక్టులు పూర్తి నిర్వీర్వమయ్యాయని ఆరోపించారు.