హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 28 (నమస్తే తెలంగాణ): వైద్యానికి తమ ప్రభుత్వం తొలి ప్రాధాన్యం ఇస్తున్నదని ఇటీవల సీఎం రేవంత్రెడ్డి చెప్పిన మాటలకు.. ప్రభుత్వ దవాఖానల్లో వాస్తవ పరిస్థితులకు పొంతనే లేదు. ఇప్పటికే చాలా చోట్ల మందుల్లేక రోగులు ఇబ్బందులు ఎదుర్కొంటుండగా.. తాజాగా రోగ నిర్ధారణ పరీక్షల కిట్లు లేక ఏ జబ్బు వచ్చిందో అర్థగాక రోగులు సతమతమవుతున్నారు. ఉస్మానియా, గాంధీ, నల్లకుంట ఫీవర్ హాస్పిటల్తోపాటు పీహెచ్సీలు, యూపీహెచ్సీలు వంటి ఏ ఒక్క దవాఖానలో కూడా కరోనా కిట్స్ లేవని స్వయానా సంబంధిత దవాఖాన వైద్యులే చెప్తున్నారు.
చాలా దవాఖానల్లో డెంగ్యూ పరీక్షలు సైతం చేయడం లేదని రోగులు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా నల్లకుంట ఫీవర్ హాస్పిటల్లో డెంగ్యూ టెస్ట్ కిట్ల కొరత కారణంగా కేవలం ఐపీ రోగులకు మాత్రమే పరీక్షలు చేస్తున్నారని ఓపీ రోగులకు ఇవ్వాళ, రేపు అంటూ కాలం వెళ్లదీస్తున్నారని పేర్కొంటున్నారు.