న్యూఢిల్లీ, అక్టోబర్ 31: ప్రపంచంలో హీలియం నిల్వలు తగ్గిపోతున్నాయి. దీనిపై వైద్యరంగం తీవ్ర ఆందోళన చెందుతున్నది. రెండింటి మధ్య లింకు ఏమిటంటారా? వైద్యపరీక్షల్లో కీలకమైన ఎంఆర్ఐ స్కానింగ్ మెషీ న్లు హీలియం లేకపోతే పనిచేయవు. అదీ సంగతి. గాలికన్నా తేలికగా ఉండే హీలియం ను బుడగల్లో నింపి పైకి ఎగురవేస్తాం. భూమి పొరల్లో దొరికే హీలియం నిల్వలు అంతకంతకూ తగ్గిపోతున్నాయి. ఎంఆర్ఐ స్కానింగ్ మెషీన్లలోని మ్యాగ్నెట్లను చల్లబరిచి యంత్రం సవ్యంగా పనిచేసేందుకు హీలియం దోహదం చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా హీలియం నిల్వలు చాలాకాలం క్రితమే అడుగంటాయి. ఇటీవలి కాలం వరకు అమెరికా హీలియం సరఫరా కోసం రష్యాపై ఆధారపడింది.
కానీ రష్యా-ఉక్రెయిన్ యుద్ధం పర్యవసానంగా ఆంక్షలు విధించడంతో సరఫరాలు నిలిచిపోయాయి. దాంతో అమెరికాలో హీలియం పంపిణీని వైద్యరంగానికే పరిమితం చేశారు. సరఫరా మందగించడంతో హీలియం ధరలు కూడా 30 శాతం దాకా పెరిగాయి. ఎంఆర్ఐ యంత్రం 12.8 సంవత్సరాల సగటు జీవితకాలంలో పదివేల లీటర్ల హీలియంను వినియోగించుకొంటుంది. దీంతో జీఈ హెల్త్‌కేర్, సీమెన్స్ హెల్త్నీర్ వంటి ఎంఆర్ఐ యంత్రాల తయారీ సంస్థలు తక్కువ హీలియం ఉపయోగించుకొనే యంత్రాల రూపకల్పనకు కసరత్తు చేస్తున్నాయి. ఎందుకంటే ఎంఆర్ఐ యంత్రాలకు సంబంధించినంత వరకు హీలియం తప్ప మరో ప్రత్యామ్నాయం లేదు.