హైదరాబాద్, జనవరి 22 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఏర్పాటైన తొలి మహిళా విశ్వవిద్యాలయానికి 819 అదనపు పోస్టులు మంజూరు చేయాలని వర్సిటీ ప్రతిపాదించింది. 359 బోధన, 460 బోధనేతర పోస్టులు కావాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించింది. వర్సిటీలో ప్రస్తుతానికి 25 మంది రెగ్యులర్ స్టాఫ్ మాత్రమే ఉన్నారు. వీరిలో 20 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు, ఇద్దరు అసొసియేట్, మరో ముగ్గురు ప్రొఫెసర్లు మాత్రమే పనిచేస్తున్నారు.
కోఠి మహిళా కాలేజీని మహిళా యూనివర్సిటీగా అప్‌గ్రేడ్ చేస్తూ 2022 ఏప్రిల్‌లో కేసీఆర్ ప్రభుత్వం జీవో-12ను జారీచేస్తూ, ‘తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయం (ఉమెన్ యూనివర్సిటీ)’ పేరును ఖరారు చేసింది. ఈ వర్సిటీ ఏర్పాటుకు అప్పట్లో రూ.100 కోట్లు కేటాయిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఉస్మానియా నుంచి ఈ వర్సిటీ విడిపోవడంతో ఓయూ నుంచి 94 టీచింగ్, 100 బోధనేతర పోస్టులు వర్సిటీకి మంజూరయ్యాయి.
ఇవి పోను ఇటీవల కొత్త కోర్సులను ప్రవేశపెట్టడం, కొత్త విభాగాలను ఏర్పాటు చేయడంతో అదనంగా 819 పోస్టులను మంజూరు చేయాలని వర్సిటీ అధికారులు ప్రతిపాదించారు. ఈ వర్సిటీ ఏర్పాటుకు రాష్ట్ర క్యాబినెట్ పచ్చజెండా ఊపినా, ఇప్పటివరకు వర్సిటీ యాక్ట్‌ను రూపొందించలేదు. ఈ నేపథ్యంలోనే క్యాబినెట్ ఆమోదం ఆధారంగా వర్సిటీ యాక్ట్‌ను అసెంబ్లీ ముందుంచాల్సి ఉంది. ఆ తర్వాత గవర్నర్ ఆమోదానికి పంపిస్తారు. ఈ ప్రక్రియను సైతం ప్రారంభించాలని వర్సిటీ అధికారులు ప్రభుత్వాన్ని కోరారు. మహిళా వర్సిటీకి తొలి వీసీని సెర్చ్ కమిటీ లేకుండానే నియమిస్తారని విద్యాశాఖ వర్గాలు తెలిపాయి.