BJP | హైదరాబాద్, నవంబర్ 13 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర బీజేపీలో కొత్త చిచ్చు పుట్టింది. ఎమ్మెల్సీ టిక్కెట్ల కేటాయింపుపై రచ్చ ఢిల్లీకి చేరింది. దీంతో టిక్కెట్ల కేటాయింపు ఆగిపోయినట్టు ప్రచారం జరుగుతున్నది. లోక్సభ ఎన్నికల సమయంలో మల్కాజిగిరి, మెదక్ ఎంపీ సీట్లు ఇస్తామంటూ కొందరు వ్యాపారవేత్తల నుంచి ముగ్గురు కీలక నేతలు వసూళ్లకు పాల్పడినట్టు రాజకీయవర్గాల్లో చెప్పుకుంటున్నారు. కొంత నగదు రూపంలో, మరికొంత భూమి రూపంలో ముడుపులు తీసుకున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. భూములను బినామీల పేరుపై రిజిస్ట్రేషన్ కూడా చేసుకున్నారని సమాచారం.
తీరా టిక్కెట్లను వేరేవారికి కేటాయించారు. దీంతో ఆ వ్యాపారవేత్తలు ముగ్గురు నేతలపై ఒత్తిడి పెంచారని తెలుస్తున్నది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో సర్దుబాటు చేస్తామని హామీ ఇచ్చారట. ఇప్పుడు ఎమ్మెల్సీ టిక్కెట్లను కేటాయించాలని సదరు వ్యాపారవేత్తలు ముగ్గురు నేతలపై ఒత్తిడి తెస్తున్నట్టు బీజేపీ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. ఆ ముగ్గురు నేతలు కూడా తాము తీసుకున్న డబ్బులకు ప్రతిఫలం ఇచ్చేందుకు నానాతంటాలు పడుతున్నారని తెలుస్తున్నది. ఈ మొత్తం వ్యవహారానికి గతంలో బీజేపీలో రాష్ట్ర స్థాయిలో కీలక పదవిలో పనిచేసిన ఓ నాయకుడు మధ్యవర్తిత్వం వహిస్తున్నట్టు సమాచారం.
ఎంపీ ఎన్నికల్లో కూడా డబ్బులు ఇచ్చినవారికి, గెలిచే అవకాశం లేనివారికి టిక్కెట్లు కేటాయించారని బీజేపీలో కొందరు లీడర్లు గుర్రుగా ఉన్నట్టు తెలుస్తున్నది. పార్టీ కోసం కష్టపడ్డవారికి కనీసం ఎమ్మెల్సీ టిక్కెట్లు అయినా ఇవ్వాలని కొన్నాళ్లుగా డిమాండ్లు వినిపిస్తున్నాయి. కానీ కొత్తగా తెరమీదికి వచ్చిన పేర్లు కమలదళంలో కొత్తచిక్కులకు కారణమయ్యాయి. పార్టీకి చెందిన సీనియర్లు ఈ విషయాన్ని ఢిల్లీ పెద్దల దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిసింది. ఢిల్లీ పెద్దలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ టిక్కెట్ల కేటాయింపును తాత్కాలికంగా పక్కన పెట్టినట్టు చర్చ నడుస్తున్నది. ఎవరెవరు ఎంతెంత తీసుకున్నారో తేల్చేందుకు అంతర్గత విచారణకు కూడా ఆదేశించినట్టు సమాచారం. ఈ పరిణామాలతో టికెట్లు ఎవరికి దకుతాయి? అనేదానిపై పార్టీలో తీవ్ర ఉత్కంఠ నెలకొన్నది.