హైదరాబాద్, మే 18 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర విద్యాశాఖ శనివారం విడుదల చేసిన టీజీ ఎప్‌సెట్ ఫలితాల్లో బీసీ, ఎస్సీ గురుకుల విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబర్చారు. మంచి ర్యాంకులను సాధించారు. మహాత్మా జ్యోతి బా పూలే బీసీ గురుకులాల్లోని సీవోఈ (సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్) నుంచి అగ్రికల్చర్ విభాగంలో 118 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకాగా 114 మంది అర్హత పొందారు. వారిలో విద్యార్థిని స్ఫూర్తి 369వ ర్యాంకును పొంది సత్తా చాటింది. మరో 12 మంది ఐదువేలలోపు ర్యాంకు సాధించారు.
ఇంజినీరింగ్ విభాగంలో 239 మంది పరీక్ష రాయగా, 191 మంది అర్హత సాధించారు. 10 వేలలోపు ర్యాంకును ఇద్దరు, 20 వేల లోపు ర్యాంకులను 15 మంది కైవసం చేసుకున్నారు. సాంఘిక సంక్షేమ గురుకుల సొసైటీలోని సీవోఈల నుంచి ఇంజినీరింగ్ కోసం 1,311 మంది పరీక్ష రాయగా, 1,282 మంది అర్హత సాధించారు. ఐదువేల లోపు ర్యాంకులను 13 మంది, 10వేల లోపు ర్యాంకులను 39 మంది విద్యార్థులు సాధించారు.
గౌలిదొడ్డి సీవోఈకి చెందిన లవన్‌కుమార్ 1,698, ఉట్కూర్ వెంకటేశ్ 1,706, లక్ష్మీకాంత్‌రెడ్డి 1,834 ర్యాంకులను సాధించారు. మెడికల్ విభాగంలో 1,134 మంది పరీక్షకు హాజరుకాగా 1,126 మంది అర్హత సాధించారు. 5000 వేల లోపు ర్యాంకును 50 మంది, 10 వేల లోపు ర్యాంకును 136 మంది సాధించారు. గౌలిదొడ్డి సీవోఈకి చెందిన సుష్మిత 401, కావేరి 526, చందన 749 ర్యాంకులతో సీవోఈ టాపర్లుగా నిలిచారు. ర్యాంకులు సాధించిన విద్యార్థులకు బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఆ శాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం, ఆయా సొసైటీల సెక్రటరీలు సైదులు, సీతాలక్ష్మీ ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు.