హైదరాబాద్, జనవరి 9(నమస్తే తెలంగాణ) : తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో(టీజీ సీఎస్బీ) భారీ ఆపరేషన్ నిర్వహించి 34మంది సైబర్ నేరగాళ్లను అరెస్ట్ చేసింది. ఈ నెల 8న నిర్వహించిన స్పెషల్ ఇంటర్‌స్టేట్ ఆపరేషన్‌లో 18 బృందాలు ఏకకాలంలో దాడులు చేసి వీరిని పట్టుకున్నారు.
అరెస్టయిన వారిలో 24మంది చిన్నారుల అశ్లీల వీడియోలను(సీఎస్ఈఏఎం) ప్రసారం చేస్తున్న పాత నేరస్థులు కాగా, మరో 10మంది మ్యూల్ బ్యాంక్ అకౌంట్ హోల్డర్లు ఉన్నారు. వారిపై 91 సైబర్ ఫిర్యాదులు, రాష్ట్రవ్యాప్తంగా 24 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి.
ఈ 24మంది నిందితులు 18-48 ఏళ్ల వయస్సు గలవారేనని, అందరూ మధ్యతరగతి, శ్రామిక వర్గానికి చెందినవారు కాగా, ఒకరు ప్రభుత్వ ఉద్యోగి ఉన్నట్టు పోలీసులు తేల్చారు. రాజేంద్రనగర్‌కు చెందిన కందాడ శ్రీకాంత్(24) గతంలో హౌస్ కీపింగ్ బాయ్‌గా పనిచేసినప్పుడు నాలుగేళ్ల బాలికను వేధించి, రికార్డు చేసిన వీడియోలను గూగుల్ డ్రైవ్‌లో అప్లోడ్ చేశాడు.
పోలీసులు అతడిని అరెస్ట్ చేసి చిన్నారిని రక్షించారు. నిజామాబాద్ సాగునీటి శాఖలో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగి కూడా 3 సీఎస్ఈఏఎం కేసుల్లో పదే పదే నేరాలకు పాల్పడినట్టు గుర్తించారు.