హైదరాబాద్, ఏప్రిల్ 4 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని ప్రభుత్వ బడుల్లో ఫేషియల్ రికగ్నిషన్ హాజరు అమలుకు రంగం సిద్ధమైంది. ఇందుకు ఫేషియల్ రికగ్నిషన్ అటెండెన్స్ మేనేజ్మెంట్ సిస్టమ్ సేకరణకు తెలంగాణ స్టేట్ టెక్నాలజీ సర్వీసెస్ లిమిటెడ్ (టీఎస్టీఎస్) సంస్థ అధికారులు టెండర్లను ఆహ్వానించారు.
ఈ టెండర్ బిడ్ల దాఖలు ప్రక్రియ బుధవారం నుంచి ప్రారంభం కానుండగా, ఈ నెల 10 వరకు అవకాశం ఉన్నది. గతంలో బయోమెట్రిక్ హాజరు, జియో అటెండెన్స్‌ను అమలు చేయగా, తాజాగా ఫేషియల్ రికగ్నిషన్ హాజరును అందుబాటులో తెచ్చేందుకు అధికారులు నిర్ణయించారు. ఇప్పటికే కొంతకాలంగా హైదరాబాద్, మేడ్చల్ -మల్కాజిగిరి జిల్లాల్లో ప్రయోగాత్మకంగా మూడు పాఠశాలల్లో అమలు చేస్తున్నారు. వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఈ విధానం పూర్తిస్థాయిలో అమల్లోకి రానున్నది.