
హైదరాబాద్, అక్టోబర్ 20 (నమస్తే తెలంగాణ): నైరుతి రుతుపవనాల ప్రభావం తెలంగాణపై అధికంగా ఉన్నదని, అందువల్లే రాష్ట్రంలో అత్యధిక వర్షాలు కురిశాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ నాగరత్న చెప్పారు. ఆజాదీకా అమృత్ మహోత్సవ్ సందర్భంగా ఈ నెల 18 నుంచి 24 వరకు నిర్వహిస్తున్న వారోత్సవాల్లో భాగంగా బుధవారం హైదరాబాద్‌లోని వాతావరణ కేంద్రంలో నిర్వహించిన అవగాహన సదస్సులో ఆమె మాట్లాడారు. ఎప్పుడైనా తెలంగాణ మీదుగానే నైరుతి రుతుపవనాలు దేశవ్యాప్తంగా విస్తరిస్తాయని తెలిపారు. తెలంగాణలో నైరుతి రుతుపవనాల ఆధారంగానే వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. ఈశాన్య రుతుపవనాల ప్రభావం ఎక్కువగా ఉండదని చెప్పారు. పర్వతాలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో గాలుల వత్తిడి వల్ల ఏకధాటిగా వర్షాలు కురుస్తాయని తెలిపారు.
ఏజెన్సీల్లో వెదర్ స్టేషన్లను మరింత విస్తరించాలి
వర్షాల సమాచారం ఎప్పటికప్పుడు తెలియజేసేవిధంగా ఏజెన్సీ ఏరియాల్లో ఆటోమెటిక్ వెదర్ స్టేషన్లను మరింత విస్తరించాల్సిన అవసరం ఉన్నదని డైరెక్టర్ నాగరత్న చెప్పా రు. ఆటోమెటిక్ రెయిన్ గేజ్‌లను కూడా ఏర్పాటుచేస్తే మరింత మెరుగైన ఫలితాలు వస్తాయని తెలిపారు. 50 ఏండ్లలో టెక్నాలజీ పెరిగిందని, వాతావరణ బులెటిన్లు ఇవ్వడంలో ఎంతో అభివృద్ధి సాధించామని చెప్పా రు. న్యూమరికల్ మెథడ్‌లో ఎనాలసిస్ చేయడం వల్ల ఎప్పటికప్పుడు తాజా బులెటిన్లు ఇవ్వగలుగుతున్నామని వెల్లడించారు. 21, 22 తేదీల్లో అంధ విద్యార్థులకు, విభిన్న సామర్థ్యం గల పిల్లలకు వాతావరణ అంశాలపై అవగాహన కల్పించనున్నట్టు తెలిపారు.
26 నాటికి పూర్తిగా తిరోగమించనున్న నైరుతి
నైరుతి రుతుపవనాలు ఈ నెల 26వ తేదీ నాటికి దేశం నుంచి పూర్తిగా తిరోగమించే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. 26వ తేదీ నుంచి ఈశాన్య రుతుపవనాలు దేశంలోకి ప్రవేశించే అవకాశం ఉన్నదని పేర్కొన్నది. 23వ తేదీ వరకు రాష్ట్రంలో మరికొన్ని భాగాల నుంచి నైరుతి రుతుపవనాలు తిరోగమిస్తాయని తెలిపింది. రాష్ట్రంలోకి ఉత్తర దిశనుంచి కిందిస్థాయి గాలులు వీస్తున్నాయని పేర్కొన్నది. ఈ నెల 26వ తేదీ వరకు రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.