Dental Doctors | హైదరాబాద్ సిటీబ్యూరో, మే 29 (నమస్తే తెలంగాణ) : ‘తెలంగాణలో ప్రాక్టీస్.. ఏపీలో రిజిస్ట్రేషన్’ అన్నట్టుగా తయారైంది దంత వైద్యుల పరిస్థితి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత కూడా తెలంగాణ డెంటిస్టుల రిజిస్ట్రేషన్లు ఏపీ డెంటల్ కౌన్సిల్ (ఏపీడీసీ) లోనే కొనసాగుతున్నాయి. తెలంగాణలో ప్రాక్టీస్ చేస్తున్న డెంటిస్టులు ఏటా తమ రిజిస్ట్రేషన్లను ఏపీడీసీలోనే రెన్యువల్ చేయించుకుంటున్నారు. దీంతో తెలంగాణ డెంటల్ కౌన్సిల్‌కు రావాల్సిన ఆదాయం ఏపీకి వెళ్లిపోతున్నది. దంత వైద్యుల రిజిస్ట్రేషన్లను 2014 వరకు ఉమ్మడి రాష్ర్టానికి చెందిన ఏపీడీసీలో నమోదుచేసేవారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఏపీడీసీ రెండుగా విడిపోయింది. 2014లో తెలంగాణ డెంటల్ కౌన్సిల్ ఏర్పాటైంది. అప్పటినుంచి ఇప్పటివరకు తెలంగాణ డెంటల్ కౌన్సిల్లో 11,000 మంది దంత వైద్యులు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. అయితే, ఉమ్మడి రాష్ట్రంలో రిజిస్ట్రేషన్లు చేయించుకున్నవారంతా నేటికీ ఏపీడీసీపరిధిలోనే రిజిస్ట్రేషన్లు కలిగి ఉన్నారు. రాష్ట్రం ఏర్పడి 11 ఏండ్లు గడుస్తున్నా తెలంగాణకు చెందిన 13,000 మంది డెంటిస్టులు తమ రిజిస్ట్రేషన్‌ను తెలంగాణకు బదిలీ చేయించుకోలేదు.
వీరంతా ఏపీ డెంటల్ కౌన్సిల్లో కొనసాగుతూ తెలంగాణలో వైద్యం చేస్తున్న పరిస్థితి కనిపిస్తున్నది. డెంటిస్ట్ యాక్ట్-1948 ప్రకారం దంత వైద్యులు ఏ రాష్ట్రంలో ప్రాక్టీస్ చేస్తున్నారో.. అదే రాష్ట్రంలో ఉన్న డెంటల్ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ అయి ఉండాలి. ఈ లెక్కన తెలంగాణలో ప్రాక్టిస్ చేస్తున్న 13,000 మంది డెంటిస్టులు తమ రిజిస్ట్రేషన్లను ఏపీ నుంచి తెలంగాణ డెంటల్ కౌన్సిల్‌కు మార్చుకోవాల్సి ఉన్నది. కానీ, వారు ఏపీ డెంటల్ కౌన్సిల్లోనే కొనసాగుతున్నందున ఏటా రెన్యువల్ ప్రక్రియ ద్వారా తెలంగాణ డెంటల్ కౌన్సిల్‌కు రావాల్సిన ఆదాయం ఏపీకి వెళ్తున్నది. దీనికితోడు భవిష్యత్‌లో వైద్య శాఖ అధికారులు జరిపే తనిఖీల్లో ఏపీ రిజిస్ట్రేషన్లు కలిగి తెలంగాణలో ప్రాక్టిస్ చేస్తే వారి మీద చర్యలు తీసుకునేందుకు ఆస్కారం కూడా ఉన్నది. రిజిస్ట్రేషన్ల బదిలీలు జరిపేందుకు ఉపయోగపడే సింగిల్ విండో సిస్టమ్ ప్రస్తుతం తెలంగాణలో అమల్లో లేదు. వెంటనే దాన్ని అమలు చేసి ఉమ్మడి రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ కలిగిన తెలంగాణ డెంటిస్టులను తెలంగాణ డెంటల్ కౌన్సిల్‌కు బదిలీ చేయాలనే అభ్రిప్రాయం వ్యక్తమవుతున్నది.
రాష్ట్రం విడిపోయిన తరువాత చాలామంది దంత వైద్యులు ఏపీ డెంటల్ కౌన్సిల్‌కు చెందిన డెంటల్ రిజిస్ట్రేషన్‌తోనే కొనసాగుతూ, తెలంగాణలో పనిచేస్తున్నారు. వీరి బదిలీకి సమయ పాలనతో కూడిన సింగిల్ విండో సిస్టంను అమలుచేయాలి. మన డెంటిస్టుల రెన్యువల్ సొమ్ము మన రాష్ట్ర డెంటల్ కౌన్సిలే తీసుకోవాలి.