హైదరాబాద్, మే 11 (నమస్తే తెలంగాణ) : ఇంటర్ ఫస్టియర్ ప్రవేశాల షెడ్యూల్ విడుదలైంది. పాత పద్ధతిలోనే అడ్మిషన్లకు సర్కార్ గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో తెలంగాణ ఇంటర్ బోర్డు సోమవారం షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఈసారి ప్రవేశాల కోసం కొత్త నిబంధన చేర్చారు. యాంటీ డ్రగ్ అఫిడవిట్ సమర్పిస్తేనే ఇంటర్ అడ్మిషన్ జారీచేయాలని ఉత్తర్వులిచ్చారు. విద్యార్థి, తల్లిదండ్రులు ఈ అఫిడవిట్ సమర్పించాల్సి ఉంటుందని స్పష్టంచేశారు. ఇలా సమర్పిస్తేనే అడ్మిషన్ కల్పించనున్నారు.
ఇంటర్ ఫస్టియర్ మొదటి విడత అడ్మిషన్ల ప్రక్రియ మంగళవారం నుంచి ప్రారంభం కానున్నది. ఈ నెల 31వరకు దరఖాస్తులు విక్రయిస్తారు. జూన్ 30లోపు మొదటి విడత అడ్మిషన్లు పూర్తికానుండగా, క్లాసులు మాత్రం జూన్ 1 నుంచే ప్రారంభమవుతాయని ఇంటర్‌బోర్డు కార్యదర్శి అభిలాష అభినవ్ తెలిపారు. అఫిడవిట్ సమర్పించాలన్న నిబంధనపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. విద్యార్థులు న్యాయవాదుల చుట్టూ తిరగాల్సి వస్తుందని, ఈ నిబంధనను తొలగించాలని తెలంగాణ గెజిటెడ్ జూనియర్ లెక్చరర్స్ అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వీ శ్రీనివాస్, కే సురేశ్ కోరారు.