శేరిలింగంపల్లి, జులై 27: రంగారెడ్డి జిల్లా గోపన్‌పల్లిలో భాగ్యనగర్ హౌజింగ్ సొసైటీ భూముల పరిరక్షణ డిమాండ్‌తో టీఎన్జీవోలు చేపట్టిన ఆందోళనలు 12వ రోజు కొనసాగాయి. ఆదివారం వివిధ జిల్లాల నుంచి తరలివచ్చిన 250 మంది ఉద్యోగులు, పెన్షనర్లు గచ్చిబౌలిలోని భాగ్యనగర్ టీఎన్జీవో హౌసింగ్ సోసైటీ కార్యాలయం వద్ద ఆందోళనలో పాల్గొన్నారు. న్యాయం చేయాలని ప్లకార్డులు ప్రదర్శించారు. ఆందోళనలపై ప్రభుత్వం నుంచి ఏలాంటి స్పందన లేకపోవడం బాధకరమని అవేదన వ్యక్తంచేశారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యోగ సంఘాల జేఏసీ అధ్వర్యంలో పెద్దఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నా సమస్యలను పట్టించుకునే నాథులే కరువయ్యారని వాపోయారు.
ఈ సందర్భంగా భాగ్యనగర్ టీఎన్జీవోల సంఘం అధ్యక్షుడు ముత్యాల సత్యనారాయణ మాట్లాడుతూ ప్రభుత్వం.. ఉద్యోగులకు న్యా యం చేసేవరకు పోరాటం కొనసాగుతుందని స్పష్టంచేశారు. నిరసనలు నిర్వహిస్తూనే న్యాయపోరాటం కొనసాగిస్తామని చెప్పారు. ప్రభుత్వం గోపన్‌పల్లి భూముల సమస్యను పరిష్కరించాలని, లేకపోతే భవిష్యత్తులో 4,000 మంది ఉద్యోగులతో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఆందోళనలో భాగ్యనగర్ టీఎన్జీవోల మ్యూచువల్ ఏయిడెడ్ కోఆపరేటీవ్ హౌజింగ్ సోసైటీ నాయకులు, ఉద్యోగులు పాల్గొన్నారు.