నల్లబెల్లి/నెక్కొండ/వంగూరు, ఏప్రిల్ 19: మక్కలు కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు పలుచోట్ల ఆందోళనకు దిగారు. కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, మార్క్ఫెడ్ సంస్థ నిర్లక్ష్యం కారణంగా తాము ఇబ్బందులు పడుతున్నామని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే బస్తాలిచ్చి కొనుగోళ్లను వేగవంతం చేయాలని డిమాండ్ చేస్తూ ఆదివారం వరంగల్ జిల్లా నెక్కొండ వ్యవసాయ మార్కెట్కు ఎదురుగా నెక్కొండ-నర్సంపేట ప్రధాన రహదారిపై రైతులు రాస్తారోకో చేపట్టారు. ఎస్సై మహేందర్ వచ్చి సముదాయించినా రైతులు ససేమిరా అన్నారు. మూడు వారాలుగా రైతులు అవస్థలు పడుతున్నారని, గన్నీ బస్తాలు తక్షణం కావాలని, పరిస్థితి రోజురోజుకూ క్లిష్టంగా మారుతున్నదని ఎస్సై డీసీవోకు పరిస్థితిని వివరించారు.
ప్రస్తుతం మార్కెట్లో 5వేల గన్నీ బస్తాలున్నాయని, మధ్యాహ్నం వరకు మరో పదివేల బస్తాలు అందించే ఏర్పాటు చేస్తానని డీసీవో హామీ ఇవ్వడంతో రైతులు శాంతించారు. కాగా నల్లబెల్లి మండలం గుండ్లపహాడ్ వద్ద జాతీయ రహదారిని రైతులు దిగ్బంధించారు. దాదాపు గంటపాటు వాహనాలు నిలిచిపోయాయి. కష్టపడి పండించిన పంటను అమ్ముకొనేందుకు మండుటెండల్లో మలమల మాడుతున్నట్టు రైతులు తెలిపారు. ప్రభుత్వ పట్టింపులేని తనంతో దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నట్టు తెలిపారు. గన్నీ బ్యాగులు, వాహనాల కిరాయి ఖర్చులు భరించి గోదాములకు మక్కలు తరలిస్తే మార్క్ఫెడ్ అధికారులు దిగుమతి చేసుకుంటారని కొనుగోలు కేంద్రం నిర్వాహకులు సూచిస్తున్నారని రైతులు వాపోయారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి మక్కలు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.

నాగర్కర్నూల్ జిల్లా వంగూరు మండలం రంగాపూర్ సింగిల్విండో కార్యాలయం ఎదుట బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతులు ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా మార్కెట్ మాజీ వైస్ చైర్మన్ మందా రాజేందర్రెడ్డి, బీఆర్ఎస్ నేతలు నర్సింహారెడ్డి, అంకు సురేందర్ మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాలు లేక మక్కజొన్న పంట కల్లాల్లో మగ్గుతున్నా ప్రభుత్వానికి చీమకుట్టినట్టు కూడా లేదని మండిపడ్డారు. సీఎం సొంత మండలంలో రైతులకు కష్టాలు తప్పడం లేదని అన్నారు.
పంటలు సాగు చేసినప్పుడు యూరియా కష్టాలు, పంట చేతికొచ్చిన తర్వాత కొనుగోలు కేంద్రాలు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదేనా ప్రజాపాలన అంటూ వారు ఘాటుగా ప్రశ్నించారు. రెండు, మూడురోజుల్లో మక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోతే సింగిల్విండోను ముట్టడిస్తామని హెచ్చరించారు.