Amitabh | ప్రముఖ రియాలిటీ క్విజ్ షో ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ (KBC) 18వ సీజన్ విజయవంతంగా కొనసాగుతోంది. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఈ షోలో తాజాగా ప్రసారమైన ఎపిసోడ్ ప్రేక్షకులను భావోద్వేగానికి గురి చేసింది. ఈ ఎపిసోడ్లో ట్రాన్స్‌జెండర్ వైద్యురాలు డాక్టర్ ప్రాచీ రాథోడ్ హాట్ సీట్లో కూర్చొని తన జీవిత ప్రయాణం, ఎదుర్కొన్న కష్టాలు, సమాజంలో ఎదురైన వివక్ష, చివరకు వైద్యురాలిగా సాధించిన విజయాన్ని పంచుకున్నారు.ఎన్నో అడ్డంకులు ఎదురైనా తన లక్ష్యాన్ని వదలకుండా వైద్య విద్యను పూర్తి చేసిన ప్రాచీ రాథోడ్ పట్టుదల, ఆత్మవిశ్వాసాన్ని చూసి అమితాబ్ బచ్చన్ సైతం ప్రత్యేకంగా అభినందించారు. ఆమె జీవిత కథ ఇప్పుడు ప్రేక్షకులను మాత్రమే కాదు, సోషల్ మీడియాలోనూ ఎంతోమందిని స్ఫూర్తిపరుస్తోంది.
చిన్నతనం నుంచే తన వ్యక్తిత్వం, లింగ గుర్తింపుకు సంబంధించిన అంతర్మథనాన్ని ఎదుర్కొన్న ప్రాచీ.. తన జెండర్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రయాణం గురించి KBC వేదికపై ఓపెన్‌గా మాట్లాడారు. మహిళగా జీవించాలనే తన నిర్ణయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పిన సమయంలో ఎదురైన పరిస్థితులను గుర్తుచేసుకుంటూ ఆమె భావోద్వేగానికి గురయ్యారు. తన నిర్ణయాన్ని మొదట్లో కుటుంబ సభ్యులు, తల్లిదండ్రులు పూర్తిగా అంగీకరించలేకపోయారని ప్రాచీ తెలిపారు. ఆ సమయంలో తాను ఎంతో కష్టమైన పరిస్థితులను ఎదుర్కొన్నానని చెప్పారు. అయినప్పటికీ తన జీవితాన్ని, చదువును మధ్యలో వదిలిపెట్టకుండా ముందుకు సాగాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు.
కష్టకాలంలో హైదరాబాద్‌లోని ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీలోని ‘హవేలీలు’ తనకు రెండో ఇల్లుగా మారాయని ప్రాచీ భావోద్వేగంగా చెప్పారు. అక్కడి వారి ప్రోత్సాహం, ఆదరణ తన జీవితంలో కొత్త ధైర్యాన్ని నింపాయని తెలిపారు.తండ్రి కన్న కలలను సాకారం చేయాలనే పట్టుదలతో, ఎన్ని కష్టాలు ఎదురైనా చదువును కొనసాగించానని ఆమె పేర్కొన్నారు. జీవితంలో వ్యక్తిగతంగా ఎన్నో సవాళ్లు ఉన్నప్పటికీ, విద్య ద్వారానే తనకు గుర్తింపు వస్తుందని నమ్మి వైద్య విద్యను పూర్తి చేసినట్లు చెప్పారు. ఎంబీబీఎస్ పూర్తి చేసిన తర్వాత కూడా తన ప్రయాణం అంత సులభంగా సాగలేదని డాక్టర్ ప్రాచీ రాథోడ్ వెల్లడించారు. సమాజంలో ఉన్న లింగ వివక్ష కారణంగా ఉద్యోగం సంపాదించడం ఎంతో కష్టంగా మారిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
ఎన్నో ఆసుపత్రులకు రెజ్యూమ్‌లు పంపినా, పలుచోట్ల ఇంటర్వ్యూలకు హాజరైనా కేవలం తాను ట్రాన్స్‌జెండర్ కావడం వల్లే అవకాశాలు నిరాకరించబడిన సందర్భాలను ఆమె గుర్తుచేసుకున్నారు. అయితే ఆ తిరస్కారాలను తన బలహీనతగా కాకుండా, మరింత ముందుకు వెళ్లేందుకు ప్రేరణగా మార్చుకున్నట్లు తెలిపారు. ఎన్ని సార్లు నిరాశ ఎదురైనా అధైర్యపడకుండా తన లక్ష్యం కోసం పోరాడి, చివరకు వైద్యురాలిగా నిలబడటం తన జీవితంలో అత్యంత గొప్ప విజయమని ప్రాచీ అన్నారు. డాక్టర్ ప్రాచీ జీవిత ప్రయాణాన్ని ఆసక్తిగా విన్న అమితాబ్ బచ్చన్ ఆమెపై ప్రశంసల వర్షం కురిపించారు. జీవితంలో ఎన్నో కష్టాలు, అవమానాలు, తిరస్కారాలు ఎదురైనా వాటిని దాచిపెట్టకుండా సమాజం ముందు ధైర్యంగా చెప్పడం ఎంతో గొప్ప విషయమని ఆయన కొనియాడారు.