చిక్కడపల్లి, నవంబర్18: లగచర్ల రైతుల హక్కుల కోసం గిరిజనులను ఏకం చేసి ఐక్య ఉద్యమాన్ని చేపడుతామని సేవాలాల్ సేన గ్రేటర్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు వడ్త్యా కల్యాణ్‌నాయక్ స్పష్టం చేశారు. లగచర్ల రైతులపై మోపిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేసి, బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఫార్మా భూముల అక్రమ సేకరణ ఆపాల్సిందేనని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గిరిజనుల పక్షాన శాంతియుతంగా సీఎం రేవంత్‌రెడ్డిని కలిసి వినతిపత్రం ఇవ్వడానికి సేవాలాల్ సేన పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో కల్యాణ్నాయక్ను ఆదివారం అర్ధరాత్రి చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు.
కంది, నవంబర్ 18: రాష్ట్రంలో నియంతృత్వం, అహంకార పాలన కొనసాగుతున్నదని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. నియంత పాలనకు ప్రజలు తగిన బుద్ధి చెప్పడం ఖాయమని హెచ్చరించారు. సంగారెడ్డి జిల్లా కంది జైలులో ఉన్న లగచర్ల బాధితులను ఎంపీ డీకే అరుణతో కలిసి సోమవారం ఆయన పరామర్శించారు. అనంతరం ఈటల మీడియాతో మాట్లాడారు. లగచర్ల ఘటనకు స్కెచ్ వేసింది కాంగ్రెస్ పార్టీయేనని ఆరోపించారు. లగచర్ల బాధితులకు ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రైతులకు సంకెళ్లు వేయడం, థర్డ్ డిగ్రీ చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.బాధితులను విడుదల చేయాలన్నారు. ఎంపీ డీకే అరుణ మాట్లాడుతూ సీఎం సొంత నియోజకవర్గంలో ఇలాంటి ఘటనలకు పాల్పడటం సిగ్గుచేటని అన్నారు. ఓట్లేసిన ప్రజల కంటే ఫార్మా కంపెనీలపై ప్రేమేందుకని ప్రశ్నించారు.