మొయినాబాద్, నవంబర్20: నాణ్యతా లోపం.. ఇంజినీరింగ్, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం వల్ల నిర్మాణంలో ఉన్న భవనం కూలి ఇద్దరు వలస కార్మికులు దుర్మరణం చెందారు. మరో ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన మొయినాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సురంగల్ గ్రామ పరిధిలో సోమవారం చోటుచేసుకుంది.
రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండల పరిధిలోని సురంగల్ గ్రామ రెవెన్యూ లో ఉన్న ఫైర్ ఫాక్స్ క్లబ్లో ఓ భవన నిర్మాణం చేపడుతున్నారు. క్లబ్ యాజమాని ఓ నిర్మాణ సంస్థకు పనులను అప్పగించారు. సుమారుగా 40 ఫీట్ల ఎత్తులో, 200 ఫీట్ల వెడల్పుతో షెడ్డు మాదిరిగా నిర్మాణం చేపట్టారు. ఇనుప స్తంభా ల మీద ఇనుప షీట్లు పైకప్పుగా వేశారు. ఆ షీట్ల మీద ఆర్సీసీ స్లాబ్ వేశారు.
భవన నిర్మాణంలో బీహార్, పశ్చిమ బెంగాల్ రాష్ర్టాలకు చెందిన కార్మికులు పనిచేస్తున్నారు. 14 మంది కార్మికులు సోమవారం పనుల్లో ఉండగా.. నిర్మాణం పైకప్పు పెద్ద శబ్దంతో విరిగి పడింది. బీహార్‌కు చెందిన సునీల్(26), పశ్చిమ బెంగాల్‌కు చెందిన బబుల్(35) శిథిలాల కింద ఇరుక్కుపోయి దుర్మరణం చెందారు. ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. మరో ఐదుగురు సురక్షితంగా బయటపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని రెస్క్యూ టీం సహాయంతో మృతదేహాలను బయటకు తీశారు. కేసు దర్యాప్తులో ఉంది.