హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 27 (నమస్తే తెలంగాణ): ప్రత్యామ్నాయ ఇంధనమైన గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తిలో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ సంస్థ (ఐఐసీటీ) కీలకపాత్ర పోషించనుంది. జీరో ఎమిషన్పై పరిశోధనలు ముమ్మరం చేస్తున్న ఐఐసీటీ.. శిలాజ ఇంధన వనరులకు ప్రత్యామ్నాయ ఇంధనాలను తయారు చేయనుంది. ఇటీవల క్లీన్ ఎనర్జీకి డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో ప్రత్యామ్నాయ ఇంధనాల తయారీకి ఆధునిక సాంకేతికతను జోడిస్తున్నది.
ఈ మేరకు రూ పొందించిన టెక్నాలజీని అవసరాల మేరకు పలు సంస్థలకు అప్పగించనుంది. దేశవ్యాప్తంగా 5 మెట్రిక్ టన్నుల మేర సహజ ఇంధన వనరులను సమకూర్చుకునే లక్ష్యంతో జాతీయ స్థాయి ప్రణాళిక ఉంది. ఈ ప్రణాళికకు అనుగుణంగా హైదరాబాద్ కేంద్రంగా ఇంధన వనరులు, రసాయనాలపై పరిశోధనలు చేసే ఐఐసీటీ ఉత్పత్తికి అవసరమైన టెక్నాలజీని సిద్ధం చేయనుంది. ఇప్పటికే హైడ్రాజీన్, బయోగ్యాస్ ప్లాంట్ వంటి అధునాతన ఇంధన వనరులకు అవసరమైన టెక్నాలజీ, రసాయనిక ఆవిష్కరణలను ఐఐసీటీ పరిశోధకులు రూపొందించారు. గ్రీన్ హైడ్రోజన్ తయారీకి సాంకేతికతకు రూపకల్పన చేయనున్నారు.
ఐఐసీటీ అభివృద్ధి చేసిన సాంకేతికతను పైరోటాస్క్ ఎనర్జీ వినియోగించుకుని కమర్షియల్‌గా భారీస్థాయిలో ఉత్పత్తి చేసేలా ఇరు సంస్థలు ఒప్పందం చేసుకున్నాయి. ఢిల్లీలో జరిగిన సీఎస్ఐఆర్ ఫౌండేషన్ డేలో రెండు సంస్థల ముఖ్యులు ఒప్పంద పత్రాలను మార్చుకున్నారు. కార్యక్రమంలో ఐఐసీటీ డైరెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి, చీఫ్ సైంటిస్ట్ శైలజారెడ్డి తదితరులు పాల్గొని గ్రీన్ హైడ్రోజన్ టెక్నాలజీ డిజైన్‌ను వివరించారు.