ఖైరతాబాద్, మే 20: దంత వైద్యులను కించపరిచేలా చర్మ వ్యాధుల వైద్యురాలు డాక్టర్ దామిశెట్టి రాజేత సామాజిక మాధ్యమాల్లో చేసిన వ్యాఖ్యలను ఇండియన్ డెంటల్ అసోసియేషన్ (ఐడీఏ) ఖండించింది. అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్ డీ నరసింహస్వామి, డాక్టర్ చలపతిరావు మంగళవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. డెంటల్ సర్జన్లను వైద్యులుగా పరిగణించరాదని డాక్టర్ రాజేత పేర్కొనడం, ‘డెంటల్ మాఫియా’ అనే పదాన్ని వాడటం చాలా బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. దంత వైద్యుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీసేలా ఆమె వ్యాఖ్యలు ఉన్నాయని తెలిపారు.
వైద్య వృత్తిలో ఉన్నవారు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తగదని హితవు పలికారు. వైద్యరగంలో దంత వైద్యం ఎంతో కీలకమైనదని తెలిపారు. దంత వైద్యుల్లో ఎవరైనా తమ పరిధిని దాటి ప్రవర్తిస్తే ఇండియన్ డెంటల్ అసోసియేషన్‌కు లేదా డెంటల్ కౌన్సిల్‌కు ఫిర్యాదు చేయాలని సూచించారు. మీడియా సమావేశంలో దంత వైద్యులు ప్రమోద్ కుమార్, రవికిరణ్‌రెడ్డి, సుధీర్, వేణుగోపాల్, శ్వేత, సునీత పాల్గొన్నారు.