హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 10(నమస్తే తెలం గాణ): తన ప్రేమకు అడ్డొస్తున్నాడనే కోపంతో యువతి తండ్రిపై కాల్పులు జరిపిన ఘటన సరూర్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆదివారం జరిగింది. ఇన్స్పెక్టర్ సైదిరెడ్డి తెలిపిన వివరాలు.. వెంకటేశ్వరకాలనీలో నివాసముండే పెరిశెట్టి రేణు కాఆనంద్కు ఇద్దరు కుమార్తెలు. చిన్న కుమార్తె ఏడో తరగతి చదువుతున్నప్పుడు అదే తరగతికి చెందిన గోగికార్ బల్వీర్ ప్రేమిస్తున్నానంటూ వేధించాడు. విషయం తల్లిదండ్రులకు చెప్పడంతో మందలించారు. ఆ తర్వాత ఎవరికివారు ఇంజినీరింగ్ వరకు చదివారు.
ఆరు నెలల క్రితం బల్వీర్ ‘నీ కూతురిని ప్రేమిస్తున్నా, నువ్వు అడ్డొస్తున్నావ్’అంటూ ఆనంద్‌కు ఫోన్‌చేసి బెదిరించాడు. దీంతో యువకుడి తల్లిదం డ్రులకు చెప్పి కౌన్సెలింగ్ ఇప్పించారు. మరింత కోపం పెంచుకున్న బల్వీర్.. ఇటీవల ఎయిర్‌గన్ కొని ఆదివారం ఆనంద్ అపార్టుమెంట్‌కు వచ్చి ఆనంద్‌పై కాల్పులు జరిపాడు. బుల్లెట్ ఆనంద్ కంటి కింది నుంచి దూసుకుపోయింది. విషయం తెలుసుకున్న పోలీసులు బల్వీర్‌ను అరెస్టు చేసి రెండు ఎయిర్గన్లతోపాటు బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు.