హైదరాబాద్, జూలై 18 (నమస్తే తెలంగాణ): రంగారెడ్డి జిల్లా, శేరిలింగంపల్లి మండలం, గుట్టల బేగంపేటలోని ఓ నిర్మాణం జోలికి వెళ్లొద్దని ఆదేశించినప్పటికీ ఎందుకు కూ ల్చేశారని హైకోర్టు హైడ్రాను ప్రశ్నించింది. గత విచారణ సమయంలో పిటిషనర్‌కు చెందిన ఇంటిని కూల్చరాదన్న ఆదేశాలు జారీచేసిన తర్వా త కూడా ఆ ఇంటిని ఎలా కూల్చేస్తారని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌ను నిలదీసింది. కోర్టు ఆదేశాలున్నప్పటికీ ఆ ఇంటిని కూల్చేయడానికి కారణాలు తెలియజేయాలని జస్టిస్ కే లక్ష్మణ్ శుక్రవారం ఆదేశించారు.
తన ఇల్లు సున్నం చెరువు పరిధిలో ఉన్నదంటూ మున్సిపల్, హైడ్రా అధికారులు కూల్చేందుకు చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకోవాలని కోరు తూ వడ్డే తార గతంలో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు సున్నం చెరువుపై సర్వే పూర్తి చేసి హద్దులు, ఎఫ్టీఎల్, బఫర్‌జోన్ నిర్ణయించాలని, ఆ తర్వాత చట్టప్రకారం చర్యలు చేపట్టాలని ఆదేశించింది. కానీ గత నెల 30న మాదాపూర్ పోలీసులు 70 మంది వచ్చి పిటిషనర్‌తోపాటు కుటుంబసభ్యులను అరెస్టు చేసి, ఇంటిని కూ ల్చేశారని న్యాయవాది తెలిపారు. దీనిపై దాఖలైన కోర్టు ధిక్కరణ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన హైకోర్టు తదుపరి విచారణను ఆగస్టు 22కు వాయిదా వేసింది.