HCU | హైదరాబాద్, మార్చి 24 (నమస్తే తెలంగాణ): ఐటీ మౌలిక వసతుల కల్పన పేరుతో ప్రభుత్వం 400 ఎకరాల అటవీ ప్రాంతాన్ని ధ్వంసం చేస్తోందని ఆరోపిస్తూ హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలైంది. దీనిపై సోమవారం విచారణ చేపట్టిన యాక్టింగ్ చీఫ్ జస్టిస్ సుజయ్ పాల్, జస్టిస్ యారా రేణుక ధర్మాసనం.. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలంటూ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. అంతకుముందు పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది నిరంజన్‌రెడ్డి వాదన వినిపిస్తూ.. హెచ్‌సీయూ పక్కన 400 ఎకరాల అటవీ భూమిని ప్రభుత్వం టీజీఐఐసీకి కేటాయించిందని, ఎకరం రూ.75 కోట్ల చొప్పున కంపెనీలకు కేటాయించేలా టీజీఐఐసీకి ఆదేశాలు జారీచేసిందని, తద్వారా రూ.30 వేల కోట్లు రాబట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నదని తెలిపారు.
ప్రభుత్వ రికార్డుల్లో అది అటవీ ప్రాంతంగా నమోదు కాకపోయినప్పటికీ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం చెట్లు, పక్షులు ఉన్న ప్రాంతాన్ని అటవీ ప్రాంతంగా పరిగణించాల్సి ఉందని పేర్కొన్నారు. దీనిపై అడ్వకేట్ జనరల్ఏ సుదర్శన్‌రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ భూమిని టీజీఐఐసీ కేటాయిస్తూ నిరుడు జూన్ 26న జారీచేసిన జీవో 54పై ఇప్పుడు పిటిషన్ వేయడం సరికాదని తెలిపారు. ధర్మాసనం స్పందిస్తూ.. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ ఏప్రిల్ 7కు వాయిదా వేసింది.