హైదరాబాద్, మే 22 (నమస్తే తెలంగాణ) : హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్సీఏ)లో వెలుగులోకి వస్తున్న అవినీతి, అక్రమ ఆర్థిక లావాదేవీలు, టికెట్ బ్లాక్ మారెట్ తదితర అంశాలు ప్రజలు, క్రీడాభిమానులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయని అఖిల భారత యువజన సమాఖ్య(ఏఐవైఎఫ్) రాష్ట్ర అధ్యక్షుడు వలిఉల్లా ఖాద్రీ, ప్రధాన కార్యదర్శి కల్లూరు ధర్మేంద్ర విమర్శించారు. శుక్రవారం హైదరాబాద్లోని ఏఐవైఎఫ్ రాష్ర ్ట కార్యాలయంలో వారు మాట్లాడారు. ఇటీవలి మీడియా సమావేశంలో రూ.20 వేల విలువైన టికెట్ల వ్యవహారం రూ.కోట్ల అవినీతి దందాలకు దారితీసిందని తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ప్రతినిధులు వెల్లడించడం రాష్ట్ర క్రీడా రంగంలో నెలకొన్న దుర్మార్గాలను బహిర్గతం చేస్తున్నదని వెల్లడించారు. ఐపీఎల్ టికెట్లను బ్లాక్మారెట్కు తరలించడం, అభిమానులకు టికెట్లు అందకుండా మధ్యవర్తుల ద్వారా అధిక ధరలకు అమ్మడం, కొన్ని వర్గాలకు ప్రత్యేక కేటాయింపులు చేయడం తదితర ఆరోపణలు ప్రజా విశ్వాసాన్ని దెబ్బతీసేవిగా ఉన్నట్లు పేర్కొన్నారు.
క్రీడలను అభివృద్ధి చేయాల్సిన సంస్థలు కొంతమంది అవినీతిపరుల చేతుల్లో వ్యాపార కేంద్రాలుగా మారడం దురదృష్టకరమని వలిఉల్లా ఖాద్రీ, కల్లూరు ధర్మేంద్ర తెలిపారు. హెచ్సీఏలో ఆర్థిక అక్రమాలు, నిధుల దుర్వినియోగం, పరిపాలనా లోపాలు, క్రికెట్ ఎంపికల్లో అన్యాయం, జిల్లాల స్థాయి క్రీడాకారులపట్ల నిర్లక్ష్యం కొనసాగుతున్నాయని ఆరోపించారు. హెచ్సీఏలో జరిగిన అన్ని ఆర్థిక లావాదేవీలపై ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించాలని, అవినీతి అధికారులు, మధ్యవర్తులపై క్రిమినల్ కేసులు నమోదు చేయకపోతే రాష్ట్రవ్యాప్తంగా యువజన ఉద్యమాలను ఉధృతం చేస్తామని వలిఉల్లా ఖాద్రీ, కల్లూరు ధర్మంద్ర హెచ్చరించారు.