Ground water | హైదరాబాద్, జూన్ 25(నమస్తే తెలంగాణ): గ్రేటర్ హైదరాబాద్ సహా రాష్ట్రవ్యాప్తంగా నివాస గృహాలు మినహా ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ సప్లయ్ యూనిట్లు, బల్ సప్లయర్స్, భారీ హౌసింగ్ సొసైటీలు, ప్రైవేట్ ట్యాంకర్లు భూగర్భ జలాలను ఇష్టారాజ్యంగా వెలికితీసి వినియోగించుకోకుండా ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది. ఆ దిశగా కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. ఇకపై నిర్ణీత మొత్తంలో రుసుం చెల్లించడాన్ని తప్పనిసరి చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు ఇవన్నీ ప్రభుత్వానికి ఒక్క రూపాయి కూడా చెల్లించకుండానే భూగర్భ జలాలను వినియోగించుకుంటున్నాయి.
దీనికి తోడు ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ యూనిట్లను కొందరు అక్రమంగా ఏర్పాటు చేస్తూ భూగర్భ జలాలను యథేచ్ఛగా తోడేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది. ఇందులో భాగంగా తెలంగాణ స్టేట్ గ్రౌండ్ వాటర్ ఎక్స్ట్రాక్షన్ రూల్స్-2023ను సిద్ధం చేసింది. ఇటీవలే ఇందుకు సంబంధించిన నూతన మార్గదర్శకాలను జారీ చేసింది. త్వరలోనే వాటిని అమలు చేయనుంది. ప్రభుత్వం ఇప్పటివరకు నీరు, చెట్టు, భూమి చట్టాన్ని (వాల్టా) అమలు చేస్తూ భూగర్భ జలాల వెలికితీతను నియంత్రిస్తున్నది. ఇకపై దాని స్థానంలో కొత్త విధానాన్ని అమలు చేయనున్నది. సెంట్రల్ గ్రౌండ్ వాటర్ అథారిటీ (సీజీడబ్ల్యూఏ) సిఫారసులకు అనుగుణంగా తెలంగాణ స్టేట్ గ్రౌండ్ వాటర్ ఎక్స్ట్రాక్షన్స్ రూల్స్- 2023ని, కొత్త చార్జీలను రూపొందించింది. 2020 నుంచే పలు రాష్ర్టాలు ఈ విధానాన్ని అమలు చేస్తుండగా ఇప్పుడు తెలంగాణ కూడా ఆ జాబితాలో చేరింది.