హైదరాబాద్, నవంబర్ 23 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో 190 ఎస్సీ గురుకులంలో అటకెక్కింది. మార్గదర్శకాలు జారీ చేసి 2నెలలు గడిచినా అమలులో ఎస్సీ గురుకుల సొసైటీ విఫలమైంది. ఎస్టీ గురుకుల సొసైటీలో అమలులోకి వచ్చినా ఎస్సీ గురుకుల సొసైటీ మాత్రం మీనమేషాలు లెక్కిస్తున్నది. దీనిపై సొసైటీ పరిధిలోని టీచర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
317జీవో బాధిత ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో క్యాబినెట్ సబ్‌కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ సూచనల మేరకు గత ఫిబ్రవరిలో మెడికల్, స్పౌజ్ కేటగిరీల్లో బదిలీలను నిర్వహించాలని, ఆ ప్రక్రియను పూర్తిగా ఆన్లైన్ ద్వారా చేపట్టాలని సర్కారు మార్గదర్శకాలు జారీ చేసింది. కానీ సొసైటీ ఉన్నతాధికారులు మాత్రం ఆ నిబంధనలను పూర్తిగా తుంగలో తొక్కారు. తుది గడువు వరకూ బదిలీలు చేపట్టలేదు. దీనిపై విమర్శలు, ఒత్తిడి రావడంతో చివరినిమిషంలో మాన్యువల్‌గా ఆ ప్రక్రియను ఇష్టారీతిన మమా అనిపించారు. వివిధ క్లాజ్‌లను ఉల్లంఘించి కనీసం ఆప్షన్ చేసుకునే అవకాశం కూడా కల్పించలేదు.
పూర్వ జోన్ 6వారిని నియమాలకు విరుద్ధంగా నూతన జోన్ 1నుంచి 4, పూర్వ జూన్ 5 టీచర్లను నూతన జోన్ 5, 6, 7కు బదిలీ చేసింది. అంతేకాదు బదిలీల్లోనూ కొందరికే అవకాశాలను కల్పించింది. సీనియర్లు, రోస్టర్ పాయింట్లలో ముందున్నవారిని కాదని జూనియర్లకు అవకాశం కల్పించిందని గురుకుల ఉద్యోగులు మండిపడుతున్నారు. అదీగాక సొసైటీలో దాదాపు 131మంది ఉద్యోగులు 317 డిస్లోకెట్, స్పౌజ్, మెడికల్ కేటగిరీల కింద దరఖాస్తు చేసుకున్నారు. అందులో స్పౌజ్ కేటగిరిలో 81మంది, మెడికల్ గ్రౌండ్లో ఆరుగురిని బదిలీ చేశారు. మిగతావన్నీ ఎందుకు పెండింగ్ పెట్టారనే విషయాన్ని సొసైటీ ఇప్పటికీ వెల్లడించలేదు. దీనిపై గురుకుల టీచర్లు ఆనాడే ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం గత సెప్టెంబర్‌లో జీవో 190 జారీ చేసింది. 317 జీవో వల్ల స్థానికత కోల్పోయిన ఉద్యోగులకు బదిలీలు, డిప్యూటేషన్స్ కల్పించేందుకు మార్గదర్శకాలు జారీ చేసింది. ఎస్టీ గురుకుల సొసైటీ, పలు ప్రభుత్వ శాఖలు ఈ జీవో అమలుకు చర్యలు చేపట్టాయి. ఎస్సీ గురుకుల సొసైటీ మాత్రం అమలును పట్టించుకోలేదు. దీంతో పాటు 317జీవో అమలులో వాటిల్లిన లోపాలను సవరించాలని గురుకుల సొసైటీలకు చెందిన పలు యూనియన్లు మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ను కలిసి ప్రత్యేకంగా మొరపెట్టుకున్నాయి.
సమస్యలను పరిష్కరించాలని కోరుతూ బస్సుయాత్రను నిర్వహించాయి. ఎస్సీ గురుకుల సంస్థల్లో 2479 ఉపాధ్యాయ ఖాళీలున్నాయని, స్థానికత కోల్పోయిన దాదాపు 250మందికి న్యాయం చేసే అవకాశమున్నదని కూడా విన్నవించారు. సమస్యలను పరిష్కరిస్తామని అమాత్యుడు హామీనిచ్చి సైతం 2నెలలు గడిచిపోయాయి. కానీ ఇప్పటికీ ఆచరణలోకి రాలేదు. ప్రభుత్వం ఇప్పటికైనా న్యాయం చేయాలని, లేదంటే పోరుబాట తప్పదని గురుకుల టీచర్లు హెచ్చరిస్తున్నారు.