RRR | ఆర్ఆర్ఆర్కు రుణబంధం.. అప్పుల కోసం ప్రభుత్వం తంటాలు!
కేంద్ర ప్రభుత్వంతో కుదిరిన ఒప్పందం ప్రకారం రోడ్డు నిర్మాణ ఖర్చు పూర్తిగా కేంద్రమే భరించనుండగా, భూసేకరణ ఖర్చులో మాత్రం రాష్ట్ర ప్రభుత్వం సగం భరించాల్సి ఉంది.
- భూసేకరణకు తప్పని రుణ సేకరణ
- రైతులకు పరిహారం చెల్లించాకే టెండర్లకు అవకాశం..
రీజనల్ రింగురోడ్డు(ఆర్ఆర్ఆర్) భవితవ్యం బ్యాంకులు ఇచ్చే రుణ సహాయంపైనే ఆధారపడి ఉన్నది. భూసేకరణకు అయ్యే ఖర్చులో సగం వ్యయం రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి ఉండగా, ఆ మొత్తం కోసం ప్రభుత్వం బ్యాంకులతోపాటు వివిధ ఫైనాన్స్ సంస్థలను సంప్రదిస్తున్నది. చెల్లించాల్సిన మొత్తంలో కొంతైనా జాతీయ రహదారుల శాఖ(ఎన్హెచ్ఏఐ)కి చెల్లిస్తే టెండర్లు పిలిచేందుకు వీలు కలుగుతుంది. దీంతో ప్రభుత్వం అప్పు కోసం నానా తంటాలు పడుతున్నది.
మొత్తం 348 కిలోమీటర్ల పొడవైన ఆర్ఆర్ఆర్ నిర్మాణానికి సుమారు 10వేల ఎకరాల వరకూ భూసేకరణ చేయాల్సి ఉంది. ఉత్తర భాగం 158.65కిలోమీటర్లకు సుమారు 4,600ఎకరాలు, దక్షిణ భాగం 189.02కిలోమీటర్లకు మరో 5400ఎకరాల వరకూ సేకరించాల్సి ఉంది. భూసేకరణకు మొత్తం ఐదున్నర వేల కోట్ల వరకు ఖర్చవుతుందని అంచనా.
RRR | హైదరాబాద్, జూన్ 9(నమస్తే తెలంగాణ): కేంద్ర ప్రభుత్వంతో కుదిరిన ఒప్పందం ప్రకారం రోడ్డు నిర్మాణ ఖర్చు పూర్తిగా కేంద్రమే భరించనుండగా, భూసేకరణ ఖర్చులో మాత్రం రాష్ట్ర ప్రభుత్వం సగం భరించాల్సి ఉంది. దీంతో భూసేకరణకు రాష్ట్ర వాటాకింద రెండున్నర నుంచి మూడు వేల కోట్ల వరకూ రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తేనే ఆర్ఆర్ఆర్ ప్రాజెక్టు ముందుకు సాగుతుంది. అయితే రోడ్డు నిర్మాణానికి ఉత్తర, దక్షిణ భాగాలుగా విభజించి పనులు చేపడుతున్నందున ముందుగా ఉత్తర భాగాన్ని చేపడుతున్నారు. ఉత్తర భాగంలో 158.65కిలోమీటర్ల రోడ్డు కోసం సుమారు 4600ఎకరాలు సేకరించాల్సి ఉండగా, అందులో ఇప్పటికే 3.5వేల ఎకరాల సేకరణ పూర్తయింది. మిగిలిన 1000ఎకరాల్లో సుమారు 200ఎకరాలు అటవీభూమి ఉంది.
అటవీభూమికి బదులుగా మరోచోట అటవీశాఖకు భూమి ఇచ్చేందుకు ప్రభుత్వం ఇప్పటికే సంసిద్ధత వ్యక్తం చేయడంతోపాటు వివిధ జిల్లాల్లో భూములను గుర్తించింది. అలాగే, సేకరించిన భూమికిగాను రాష్ట్రవాటా కింద చెల్లించాల్సిన మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం జాతీయ రహదారుల అథారిటీకి చెల్లించాల్సి ఉంది. దీనికోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు నిధుల వేటలో పడింది. రోడ్డు నిర్మాణానికి రుణం ఇస్తాం కానీ భూ సేకరణ కోసం రుణం ఇచ్చే అవకాశం లేదని బ్యాంకులు స్పష్టం చేసినట్టు సమాచారం. దీంతో రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా హడ్కో నుంచి రుణం సేకరించేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. అయితే, హడ్కో నుంచి ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి రూ. 8000కోట్లు కోరగా, అందులో రూ. 3000కోట్లు ఇప్పటికే మంజూరు చేసింది. తాజాగా ఆర్ఆర్ఆర్కు కూడా రుణం కావాలని ప్రభుత్వం కోరుతున్నది. దీనిపై హడ్కో ఏ విధంగా స్పందిస్తుందనేది తెలియాల్సివుంది.
కోర్టు కేసుతో నిలిచిన ఉత్తర భాగం భూసేకరణ
వాస్తవానికి భూసేకరణకు అయ్యే మొత్తం ఖర్చును ఒకేసారి చెల్లించాలని జాతీయ రహదారుల అథారిటీ కోరినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి బాగా లేనందున దశలవారీగా చెల్లిస్తామని అధికారులు తెలిపారు. కేంద్ర రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో రాష్ట్ర ఆర్అండ్బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి జరిపిన చర్చలు ఫలప్రదం కావడంతో దశలవారీగా చెల్లించేందుకు కేంద్రం సమ్మతించింది. దీంతో ముందుగా ఉత్తర భాగం రోడ్డు నిర్మాణానికి అవసరమయ్యే సుమారు రెండున్నర వేల కోట్లు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటికే ఉత్తర భాగంలో దాదాపు 80శాతం వరకూ భూసేకరణ పూర్తికావడంతో భూములు కోల్పోయిన రైతులకు నష్ట పరిహారం చెల్లిస్తే టెండర్ల ప్రక్రియ చేపట్టే అవకాశం కలుగుతుంది. అలాగే, మిగిలిన 20శాతం భూసేకరణ కూడా త్వరితగతిన చేపట్టాల్సి ఉంటుంది. అయితే, రాయగిరి ప్రాంతంలో రైతులు భూసేకరణకు వ్యతిరేకంగా న్యాయస్థానాన్ని ఆశ్రయించంతో కోర్టు స్టే విధించింది. దీంతో అక్కడ భూసేకరణను నిలిపివేశారు. ప్రస్తుతం అక్కడ భూసేకరణ చేయాలంటే రైతులను ఒప్పించడమో లేక అలైన్మెంటులో స్వల్పంగా మార్పులు చేయడమో చేయాల్సివుంది.
ఉత్తర భాగం కొలిక్కొచ్చాకే దక్షిణ భాగం
ఉత్తర భాగం పనులకు టెండర్ల ప్రక్రియ ఓ కొలిక్కి వచ్చాకే దక్షిణ భాగం పనులకు శ్రీకారం చుట్టే అవకాశముంది. దక్షిణ భాగం రోడ్డు నిర్మాణానికి సమగ్ర ప్రాజెక్టు నివేదికను సిద్ధం చేసిన అధికారులు, త్వరలోనే దాన్ని కేంద్రానికి సమర్పించనున్నారు. అయితే, ఉత్తర భాగం పనులను భారత్‌మాతా పరియోజనలో భాగంగా మంజూరు చేయగా, దక్షిణ భాగం పనులను వికసిత్ భారత్ ప్రాజెక్టు కింద చేపట్టే అవకాశం ఉందని అధికారవర్గాలు చెబుతున్నాయి. ఎందుకంటే, భారత్‌మాతా పరియోజన కార్యక్రమంలో ఇప్పటికే పెద్ద ఎత్తున రోడ్డు ప్రాజెక్టులు చేపట్టినందున దక్షిణ భాగం పనులు అందులో చేపట్టే వీలు లేదని వారు పేర్కొంటున్నారు. దక్షిణ భాగం అలైన్‌మెంటు ఖరారైతే అనంతరం భూసేకరణ ప్రక్రియను చేపడతారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

