వ్యవసాయ యూనివర్సిటీ/హైదరాబాద్, జూన్ 23 (నమస్తే తెలంగాణ ): వ్యవసాయంతోపాటు రైతులకు సంబంధించిన వివిధ అంశాలపై కలిసి పనిచేయాలని ప్రపంచ బ్యాంక్ ఆధ్వర్యంలోని ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ (ఎఫ్ఏవో), తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం నిర్ణయించాయి. రాష్ట్ర వ్యవసాయ వర్సిటీ అద్భుత ఫలితాలను సాధిస్తున్నదని ఎఫ్ఏవో ఎకనమిక్ డెవలప్మెంట్ కన్సల్టెంట్ డాక్టర్ పోలియాకోవ్ ప్రశంసించారు. దీని వెనుక వర్సిటీ అధికారుల సమిష్టి కృషితోపాటు రాష్ట్ర ప్రభుత్వ సహకారం ఉన్నదని పేర్కొన్నారు.
శుక్రవారం ఆయన ఆచార్య జయశంకర్ వ్యవసాయ వర్సిటీని సందర్శించి, ఇంచార్జి రిజిస్ట్రార్ డాక్టర్ వెంకటరమణతోపాటు ఇతర అధికారులతో సమావేశమయ్యారు. విద్య, పరిశోధన రంగాల్లో వర్సిటీ సాధించిన ప్రగతితోపాటు ప్రస్తుతం చేపడుతున్న కార్యక్రమాలు, అనుబంధ విభాగాల గురించి పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా తెలుసుకున్నారు. వ్యవసాయానికి సంబంధించిన పలు విషయాలతోపాటు వాతావరణ మార్పుల ప్రభావం, టెక్నాలజీ వ్యాప్తి, కృషి విజ్ఞాన కేంద్రాల బలోపేతం తదితర అంశాలపై చర్చించారు. అనంతరం వ్యవసాయ కళాశాలలో ఏర్పాటు చేసిన ఏవీఆర్ ల్యాబ్‌ను డాక్టర్ పోలియాకోవ్ సందర్శించారు.