సూర్యాపేట, జనవరి 14: రెండేండ్లుగా రాష్ట్రంలో ప్రజా వ్యతిరేక పాలన సాగిస్తున్న కాంగ్రెస్ చెడు ఆలోచనలు భోగి మంటల్లో మాడిపోవాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి అన్నారు. రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం పట్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి సోయి లేదని విమర్శించారు. పాలకుల తీరు ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా ఉన్నదని దుయ్యబట్టారు. భోగి పండుగ సందర్భంగా బుధవారం తెల్లవారుజామున సూర్యాపేట జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ నాయకుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భోగి వేడుకలను ప్రారంభించి, ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రెండేండ్ల పాలనలో అరాచకాలు, అక్రమాలు తప్ప సర్కార్ చేసిందేమి లేదని ధ్వజమెత్తారు. మంత్రుల చెడు ఆలోచనలు కూడా భోగి మంటల్లో కాలిపోవాలని, ఈ ఏడాది నుంచైనా మంచి పరిపాలన కొనసాగాలని ఆకాంక్షించారు. ఈ వేడుకల్లో మాజీ ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, మున్సిపల్ మాజీ చైర్పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ శ్రీనివాస్, గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.