హైదరాబాద్, జూలై 19 (నమస్తే తెలంగాణ)/సిటీ బ్యూరో/నెట్వర్క్: కార్పొరేట్ కంపెనీల కోసమే కేంద్రప్రభుత్వం విద్యుత్తు సవరణ బిల్లు-2021ను తీసుకొస్తున్నదని, వెంటనే ఆ బిల్లును ఉపసంహరించుకోవాలని విద్యుత్తు ఉద్యోగుల సంఘాలు డిమాండ్ చేశాయి. ప్రభుత్వరంగ సంస్థలను నిర్వీర్యం చేయాలని కేంద్రం చూస్తున్నదని ఆరోపించాయి. విద్యుత్తు సంస్థల ప్రైవేటీకరణను వెంటనే నిలిపివేయాలని కోరుతూ సోమవారం రాష్ట్రవ్యాప్తంగా ఆయా సంఘాలు ఆందోళనలు చేపట్టాయి. ప్రజల కోసం పనిచేస్తున్న విద్యుత్తు సంస్థలను బడా కార్పొరేట్లకు ధారాదత్తం చేయడానికి జరుగుతున్న కుట్రలను తిప్పకొట్టాలని తెలంగాణ విద్యుత్తు ఇంజినీర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎన్ శివాజీ పిలుపునిచ్చారు. బిల్లును అడ్డుకోవడానికి చేపట్టాల్సిన కార్యాచరణ కోసం నిర్వహించిన సమావేశంలో టీఈఈఏ ప్రధాన కార్యదర్శి రామేశ్వరయ్య శెట్టి, కంపెనీ ప్రతినిధులు వెంకట్రామయ్య, తుల్జారాంసింగ్ తదితరులు పాల్గొన్నారు.
కార్పొరేట్ల కోసమే డిస్కంల ప్రైవేటీకరణ
కార్పొరేట్ల కోసమే కేంద్రం డిస్కంలను ప్రైవేటీకరించే చట్టాలను ఆఘమేఘాలపై తీసుకొస్తున్నదని విద్యుత్తు అకౌంట్స్ అధికారుల సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు అశోక్, అంజయ్య ఆరోపించారు. సోమవారం హైదరాబాద్‌లోని మింట్ కౌంపౌండ్లో ఆ సంఘం ప్రతినిధులు అశోక్, నాసర్షరీఫ్, వీరస్వామి, వేణుబాబు, వెంకటేశ్వర్లు, పరమేశ్, అనూరాధ తదితరులతో కలిసి నిరసన తెలిపారు. విద్యుత్తు సవరణ బిల్లును ప్రవేశపెడితే దేశవ్యాప్తంగా సమ్మె నిర్వహిస్తామని జాతీయ విద్యుత్తు ఉద్యోగులు, ఇంజినీర్ల సమన్వయ కమిటీ ప్రతినిధులు హెచ్చరించారు. కార్యక్రమంలో తెలంగాణ విద్యుత్తు ఉద్యోగుల జేఏసీ ప్రతినిధులు పద్మారెడ్డి, సాయిబాబు, రత్నాకర్‌రావు, సదానందం, బీసీరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
యాదాద్రి ప్లాంటు వద్ద ఆందోళన
విద్యుత్తు సవరణ బిల్లును నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ నల్లగొండ జిల్లా దామరచర్ల పరిధిలోని యాదాద్రి పవర్ ప్లాంట్ వద్ద ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. ఈ కార్యక్రమంలో పవర్‌ప్లాంటు డీఈ కిరణ్‌కుమార్, ఏడీఈ సురేశ్‌రెడ్డి, ఏఈ శివ, ఎస్ఈలు, ఏడీఆర్‌లు పాల్గొన్నారు. నల్లగొండ జిల్లా కేంద్రంలోని విద్యుత్తు ఎస్ఈ కార్యాలయం వద్ద చేపట్టిన ధర్నాలో 1104 యూనియన్ జిల్లా కార్యదర్శి ఎన్ వెంకటయ్య, 327 యూనియన్ జిల్లా కార్యదర్శి సురేశ్‌కుమార్, ఇంజినీర్స్ అసోసియేషన్ నాయకుడు నరేశ్‌కుమార్, ఏఈ అసోసియేషన్ నాయకుడు శ్రీనివాస్‌రెడ్డి, నరేందర్ రాజు పాల్గొన్నారు.