శనివారం 23 జనవరి 2021
Telangana - Dec 01, 2020 , 02:05:32

దేశానికి కేసీఆర్‌ అవసరం

దేశానికి కేసీఆర్‌ అవసరం

  • యూపీ యువ రచయిత చందన్‌ రాయ్‌
  • దమ్మున్న నేత సీఎం కేసీఆర్‌  
  • దేశ రాజకీయాల్లోకి రావాలి
  • ప్రధాని మోదీ చేసిందేమీ లేదు 
  • దేశంలో అరాచక శక్తుల రాజ్యం
  • నిలువరించాల్సిన అవసరముంది  
  • అది తెలంగాణ సీఎంతోనే సాధ్యం

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ఆయనో యువ రచయిత. అంతకు మించి న్యాయవాది. పుట్టింది.. పెరిగింది.. చదివింది.. నివాసముంటున్నది అంతా ఉత్తరప్రదేశ్‌లోనే. కానీ ఇప్పుడు హైదరాబాద్‌ వచ్చారు. వ్యక్తిగత పనుల కోసం కాదు. ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా ప్రచారం చేసేందుకు. ఒక్క మన రాష్ట్రమే కాదు. ఎక్కడ ఎన్నికలు జరిగితే అక్కడికి వెళ్లడం. ఎన్డీయే సర్కారుకు వ్యతిరేకంగా ప్రచారం నిర్వహించడం ఒక పనిగా పెట్టుకుంటున్నారు? బీజేపీపై ఎందుకు అంత అక్కసు? ఏం జరిగింది? అంతలా వ్యతిరేకించడానికి కారణం ఏమిటీ? అన్న విషయాలను తెలుసుకునేందుకు ‘నమస్తే తెలంగాణ’ ఆయనతో ముచ్చటించగా ఎన్నో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. దేశంలో అరాచక శక్తులు రాజ్యమేలుతున్నాయని, ప్రస్తుత పరిస్థితుల్లో వాటిని అడ్డుకునే దమ్మున్న నేత ఒక్క తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ మాత్రమేనని, ఆయన జాతీయ రాజకీయాల్లోకి రావాలని ఆకాంక్షించారు. ఆయన అభిప్రాయాలు ఆయన మాటల్లోనే..

మీ గురించి చెప్పండి?

నాది యూపీ (ఉత్తరప్రదేశ్‌) రాష్ట్రం. లక్నోలోనే ఉంటా. నా అసలు పేరు పీయూష్‌కుమార్‌ రాయ్‌. ఎంఏ హిందీ, ఎల్‌ఎల్‌బీ పూర్తి చేశా. సాహిత్యం అభిరుచి. చందన్‌రాయ్‌ పేరిట ఇప్పటికే ఎన్నో కవితలను రాశా. సాహితీ పురస్కారాలను అందుకున్నా.  

ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా ప్రచారం చేపట్టడంలో మీ ఉద్దేశం? ప్రత్యేక కారణం ఏదైనా ఉందా? 

ఒక్క విషయం సూటిగా చెప్పగలను. దేశంలో గత ఆరేండ్లుగా ఫాసిస్టు శక్తులు రాజ్యమేలుతున్నాయి. ప్రధాని అయ్యాక మోదీ ఈ దేశంలోని పేదలు, సామాన్య ప్రజలకు చేసిందేమీ లేదు. కార్పొరేట్‌ కంపెనీల కొమ్ముకాస్తున్నాడు. జాతి సంపదను దోచిపెడుతున్నాడు. అంతకుమించి నాకు బాధ కలిగిస్తున్న అంశం ఏమిటంటే ప్రజలను మతం పేరిట విడదీస్తున్నాడు. మత కలహాలను ప్రోత్సహిస్తున్నాడు. దక్షిణభారతంలో బీజేపీ లేదు. కాబట్టి అదృష్టవంతులు. అక్కడ ఉత్తరభారతంలో పరిస్థితి అధ్వానంగా ఉంది. అందుకే దేశవ్యాప్తంగా ప్రచారం మొదలు పెట్టాను. అందులో భాగంగానే హైదరాబాద్‌ వచ్చాను. ఇప్పుడు ఇక్కడ ప్రచారం చేస్తున్నాను. 

హైదరాబాద్‌లో ప్రచారం చేసేందుకు మీ యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ వచ్చారు? దీనిపై మీరేమంటారు?

అసలు ఆయనకు ఆ అర్హతనే లేదు. ఎందుకంటే అక్కడేం చేశారో అందరికీ తెలుసు. రాష్ట్రంలో ఆయన చేసిన అభివృద్ధేమీ లేదు. అదీగాక ఆయన పాలన పగ్గాలను చేపట్టిన తరువాత దేశంలో ఎక్కడా లేని విధంగా యూపీలో లైంగికదాడులు పెరిగిపోయాయి. అభివృద్ధి అన్న మాటంటేనే యూపీ ప్రజలకు తెలియకుండా పోయింది. ఆయన ఇక్కడికి వచ్చి ప్రచారం చేసే బదులు తెలంగాణ రాష్ట్రం నుంచి పాఠాలు నేర్చుకోవాలి.  

మోదీ, యోగి అభివృద్ధి చేయలేదంటున్నారు? గత సాధారణ ఎన్నికల్లో  ఎలా విజయం సాధించారు? 

మంచి ప్రశ్న. మీకు ఇక్కడ ఒక విషయం తెలపాలి. మోదీ, యోగీనే కాదు. మొత్తం బీజేపీ సర్కారు ఝూటా. సోషల్‌ మీడియాను, జాతీయ ప్రసార మాధ్యమాలను తమ గుప్పిట్లో పెట్టుకున్నారు. ఒక నిజం పది మందికి చేరేలోగా వారు తమ అబద్ధాలను లక్ష మందికి చేరవేస్తున్నారు. అదీగాక జాతీయత, మత విద్వేషాలను రెచ్చగొట్టేలా ప్రచారం కల్పిస్తున్నారు. ఒక ఉదాహరణ చెప్తాను. దేశంలో ఉన్న అనేక సమస్యలను పక్కన పెట్టి జాతీయ మీడియా మొత్తం కేవలం బాలీవుడ్‌ హీరో సుశాంత్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్య, కంగనా రనౌత్‌, డ్రగ్స్‌ మాఫియా చుట్టే తిరిగింది. చర్చలను నడిపాయి తప్పా.. బీజేపీ వైఫల్యాలను తీసుకురాలేదు. అలాంటి ఎత్తులతోనే 2019లోనూ అధికారంలోకి వచ్చారు.  అప్పుడే కాదు రేపు కూడా అధికారంలోకి వచ్చేందుకు అలాంటి వ్యూహాన్నే అనుసరిస్తారు.  

హైదరాబాద్‌లో ఎక్కడెక్కడ తిరిగారు? గతానికి ప్రస్తుతానికి మీరేం తేడాలు గమనించారు?

నేను గతంలోనూ హైదరాబాద్‌ను సందర్శించాను. అప్పుడు చూసినదానికి ఇప్పుడు చూస్తున్నదానికి ఎంతో తేడా ఉంది. అభివృద్ధి అనేది స్పష్టంగా కనబడుతున్నది. తెలంగాణను చూసి ఉత్తరాది రాష్ర్టాలు నేర్చుకోవాల్సి ఉన్నది. నేను వ్యక్తిగతంగానూ చాలామంది హైదరాబాదీలతో మాట్లాడాను. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న రూ.5 రూపాయల భోజన పథకం.. డబుల్‌ బెడ్రూం ఇండ్లు వంటి పథకాలను ఎన్నో ప్రవేశపెట్టిందని వివరిస్తున్నారు.    

జీహెచ్‌ఎంసీ ఎన్నికల సందర్భంగా నగర ఓటర్లకు మీరిచ్చే సందేశమేమిటి? 

హైదరాబాదీలకు నా విజ్ఞప్తి ఒక్కటే. ఇక్కడ విభిన్న సంస్కృతులు, వివిధ ప్రాంతాల వారు జీవిస్తున్నారు. ఉపాధి కోసం వచ్చి ఇక్కడే స్థిరపడి ప్రశాంత జీవితాన్ని గడుపుతున్నారు. అలాంటి వారే కాక ఇక్కడ పుట్టిన, పెరిగిన వారు కూడా ఉన్నారు. ప్రశాంతంగా జీవితం సాగించాలంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి మద్దతుగా నిలవండి. అభివృద్ధిని గెలిపించండి. రేపు మతతత్వ రాజకీయాలను చేసే బీజేపీకి ఓటేస్తే ఈ నగరం రావణకాష్టంగా మారుతుంది. అది నేను కచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే ఉత్తరాదిలోని బీజేపీ పాలితరాష్ర్టాల్లో నేడు చోటుచేసుకుంటున్న సంఘటనలను ప్రత్యక్షంగా చూస్తున్నాను కాబట్టి ఈ విషయం చెప్తున్నా. అభివృద్ధి చేసే టీఆర్‌ఎస్‌ను గెలిపించండి.

సీఎం కేసీఆర్‌ పరిపాలన గురించి చెప్పండి?

ప్రస్తుతం దేశం సంక్షోభంలో కూరుకుపోయింది. పైపెచ్చు మోదీ అరాచకాలు పెరిగిపోతున్నాయి. ఇప్పుడు బీజేపీ ఉత్తరాదిలోనే కాదు.. ఇటు దక్షిణాదిలోనూ మతతత్వ ఎజెండాను విస్తరించాలని వేగంగా అడుగులు వేస్తున్నది. దానిని నిరోధించే ప్రతిపక్షమనే పార్టీ.. అంతటి నాయకుడు లేకుండా పోయిండు. ఇప్పుడు దేశ ప్రజలకు ఆశా కిరణంలా ఒక్క కేసీఆరే ఉన్నారు. మోదీని.. మతతత్వ రాజకీయాలను ఎదుర్కొనగల దమ్మున్న నాయకుడు కేసీఆరే. ఆయన జాతీయ రాజకీయాల్లోకి రావాల్సిన అవసరమేకాదు.. ఇప్పుడు ఆ ఆవశ్యకత కూడా ఎంతో ఉంది. 


logo