హైదరాబాద్, ఫిబ్రవరి 5 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో చేపట్టిన కులగణన బీసీల కోసం చేసింది కాదని, సీఎం పీఠాన్ని దక్కించుకోవడానికి చేసిందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ ధ్వజమెత్తారు. హైదరాబాద్ లక్డీకాపూల్‌లో బుధవారం ‘తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో బీసీ కులగణనపై జరిగిన పరిణామాలు-సీఎం గారి తప్పుడు లెక్కలు-భవిష్యత్తు కార్యాచరణ’ అన్న అంశంపై బీసీ సంఘాలు, బీసీ మేధావుల అత్యవసర సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇది ముమ్మాటికీ ఫేక్ సర్వే అని, దీనిని బీసీలందరూ తిరస్కరిస్తున్నారని, ఇదే విషయాన్ని దేశవ్యాప్తంగా ప్రచారం చేస్తామని చెప్పారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుల మీద తప్పులు చేస్తున్నదని, ఒక తప్పును కప్పిపుచ్చుకోవడానికి 100 తప్పులకు పాల్పడుతున్నదని ఆరోపించారు. అసెంబ్లీలో బీసీ కులగణనపై తీర్మానం చేయకున్నా, చేసినట్టు బిల్డప్ ఇచ్చారని ఎద్దేవా చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి 42 శాతం రిజర్వేషన్లు సాధ్యంకాకపోతే పార్టీ పరంగా 42 శాతం టికెట్లు ఇస్తామనడం హాస్యాస్పదమని పేర్కొన్నారు. పార్టీపరమైన నిర్ణయాలను అసెంబ్లీలో ఎందుకు ప్రకటించాల్సి వచ్చిందని నిలదీశారు.
అసెంబ్లీ ఏమైనా గాంధీభవన్ అనుకున్నారా? గాంధీభవన్‌లో మాట్లాడాల్సిన మాటలు అసెంబ్లీలో ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందని, అసెంబ్లీలో సీఎం మాట్లాడిన మాటలన్నీ కాకమ్మ కథలని, అభూత కల్పనలని అభివర్ణించారు. నిజంగా సీఎం మాటల్లో వాస్తవాలు ఉంటే ఎల్బీస్టేడియంలో కూర్చొని మాట్లాడుదామని సవాల్ చేశారు. బీసీలకు చేసిన అన్యాయాలను నిరూపిస్తామని, లేదంటే ముక్కు నేలకు రాస్తామని సవాల్ చేశారు. ఎస్సీ ఉపకులాల వర్గీకరణ కోసం పోరాడి అసెంబ్లీలో తీర్మానం చేయించుకున్న మంత్రి దామోదర రాజనర్సింహను చూసి బీసీ మంత్రులు బుద్ధితెచ్చుకోవాలని జాజుల శ్రీనివాస్‌గౌడ్ హితవు పలికారు.